న్యూఢిల్లీ: భారత్లో పరోక్ష ధూమపాన మరణాలు 1990తో పోలిస్తే 2003 నాటికి 50శాతం మేరకు పెరిగాయి. 2023లో భారత్లో 44.4 కోట్ల మంది పరోక్ష ధూమపానానికి గురైనట్లు ప్రపంచవ్యాప్త విశ్లేషణ వెల్లడించింది. ఆరోగ్యపరంగా పిల్లలకు ఇది గణనీయమైన ముప్పును కలిగిస్తున్నది. 1990లో పరోక్ష ధూమపానానికి గురైన వారి సంఖ్య 37.5 కోట్లుగా ఉండగా, 2023 నాటికి అది 44.4 కోట్లకు పెరిగిందని లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైన విశ్లేషణ తెలియజేసింది.
‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్'(జీబీడీ) 2023 సెకెండ్ హ్యాండ్ స్మోక్ కొలాబరేషన్’గా ఏర్పడిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం 204 దేశాల్లో పరోక్ష ధూమపానానికి గురయ్యే స్థాయి, దాని వల్ల కలిగే వ్యాధుల భారాన్ని అంచనా వేసింది. భారత్లో 1990లో పరోక్ష ధూమపానం కారణంగా నమోదైన మరణాలు 2,17,700 కాగా, 2023లో అవి 3,25,600కు పెరిగాయి. పరోక్ష ధూమపానానికి గురికావడం వల్ల గుండె, శ్వాసకోశ సంబంధిత సమస్యలు సహా పలు వ్యాధుల ముప్పు పెరుగుతుందని ఢిల్లీకి చెందిన ప్రముఖ వైద్యురాలు నీతూజైన్ ‘పీటీఐ’కి తెలిపారు.