
దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు కేపీ. వివేకానంద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ఆధ్వర్యంలో శుక్రవారం గండిమైసమ్మ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధర్నాలో కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్లకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలతోపాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వడ్లు కొంటారా.. కొనరా..: ఎమ్మెల్యే వివేకానంద్
వడ్లను కొనుగోలు చేసేది లేదని ఇటీవల కేంద్ర మంత్రి చెప్పాడని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వడ్లు కొంటామని చెబుతూ రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే గుజరాత్లో వడ్లు కొనుగోలు చేస్తున్న మాదిరిగానే ఇక్కడ కూడా యాసంగిలో పండించే పంటలను కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు, ఇక్కడి బీజేపీ నేతల ప్రకటనలకు పొంతన లేదన్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పర్చాలన్నారు. అసలు రాష్ట్రంలో పండించే యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేస్తుదా..! చేయదా..! సూటిగా చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతల తప్పుడు ప్రచారం ఎండగట్టాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
బీజేపీ నేతల తప్పుడు ప్రచారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కార్యకర్తలకు సూచించారు. కేంద్ర మంత్రులు ఒక రకంగా మాట్లాడుతుంటే, ఇక్కడి నేతలు మరో రకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కూడా గండిమైసమ్మ నుంచి కొనసాగించామని, ఇప్పుడు రైతుల కోసం ఉద్యమ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలు కావడంపై హర్షం వ్యక్తం చేశారు.