సంక్రాంతి విజయాలతో ఈ ఏడాది తెలుగు సినిమాకు శుభారంభం దక్కింది. దాంతో వేసవి సినిమాల కోసం అభిమానులు మరింత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే సమ్మర్ రిలీజ్ డేట్స్ విషయంలో గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. ఏ సినిమా ఎప్పుడొస్తుందోనని అభిమానుల్లో ఆతృత పెరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం వెలువడిన సరికొత్త అప్డేట్స్తో వేసవి చిత్రాల విషయంలో కొంత స్పష్టత లభించినట్లయింది. పవన్‌కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని మార్చి 26న, రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు ఆయా చిత్రాల నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ‘పెద్ది’ సినిమా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 27న రావాల్సి ఉంది.
అయితే ఏప్రిల్ 30ని కొత్త విడుదల తేదీగా ప్రకటించారు. అంటే ‘పెద్ది’ ముందుగా అనుకున్న రిలీజ్ స్లాట్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రాబోతున్నారు. మొత్తానికి నెల వ్యవధిలోనే మెగా హీరోల రెండు చిత్రాలు రానుండటంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఇందులో పవన్‌కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇక ‘పెద్ది’ రూరల్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఆటకూలీ పాత్రలో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.