మహబూబ్‌నగర్/మెట్టుగడ్డ, జూన్ 1 : రాష్ర్టావతరణ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో గురువారం నిర్వహించనున్న వేడుకల్లో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. ముందుగా ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం సాయు ధ బలగాల గౌరవవందనాన్ని స్వీకరిస్తారు.
ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించనున్నారు. అలాగే విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్, శకటాల సందర్శన ఉంటుంది. రాష్ర్టావతరణ వేడుకలు నిర్వహించే పోలీసు పరేడ్ మైదానం లో అవసరమైన తాగునీరు. టెంట్లు, ఆహ్వానితులకు కుర్చీ లు తదితర అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తిపై కవిసమ్మేళనం నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కలెక్టరేట్‌తోపాటు, జిల్లా పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలు, మామిడితోరణాలు, రంగురంగుల కాగితాలతో అలంకరించారు.
పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ సీతారామారావు పరిశీలించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అనంతరం ట్రాఫి క్ పోలీసు విభాగానికి కేటాయించిన రోడ్ స్టాపర్స్, రాత్రివేళ్లలో ధరించే మెరుపు దుస్తులు, లాఠీలను ఎస్పీ వెంకటేశ్వర్లు పోలీసు సిబ్బందికి అందజేశారు. విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు శ్రీనివాసులు, ఆదినారాయణ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జూన్ 1 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబ్ చేశా రు. గ్రామపంచాయతీ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జూన్ 1 : మండలంలోని అన్ని గ్రామాల్లో రాష్ర్టావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీల్లో జాతీయ పతాకం ఎగురవేయాలని ఎంపీడీవో ధనుంజయగౌడ్ తెలిపారు. వేడుకల్లో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.