వరంగల్‌చౌరస్తా, ఆగస్టు 3: వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మహబూబాబాద్ జిల్లా సబ్ జైలు రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. పాత కేసు విషయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తల్లి మైసమ్మ, భార్య శారద, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన జనగాం వెంకటేశ్ (32) వరంగల్ చింతల్ ప్రాంతంలోని జ్యోతిబసు కాలనీలో ఉంటూ కొన్నేళ్లుగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.
గూడూరు పోలీస్ స్టేషన్లో 2017లో నమోదైన ఓ కేసులో వెంకటేశ్ నిందితుడిగా ఉన్నాడు. జూలై 31న కాశీబుగ్గ ప్రాంతంలో గూడూరు పోలీసులు విచారణ పేరుతో వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫోన్‌ను తోటి కార్మికులకు అప్పగించారు. ఆగస్టు 1 శనివారం మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడంతో సబ్ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లిన అనంతరం రాత్రి సమయంలో వెంకటేశ్ రక్తపు వాంతులు చేసుకోగా జైలు సిబ్బంది వరంగల్ ఎంజీఎంహెచ్కు తరలించారు. ఆగస్టు 2న ఆదివారం ఉదయం సుమారు 4గంటల సమయంలో పోలీసులు ఫోన్ చేసి మీ కుమారుడు ఎంజీఎంహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందించారన్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు రక్తపు వాంతులు చేసుకోవడంపై అనుమానాలు ఉన్నాయని తల్లి మైసమ్మ తెలిపారు. పోలీసుల చిత్రహింసలతోనే మృతి చెంది ఉంటాడని ఆరోపించింది.
వెంకటేశ్ మృతిపై గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి వెంకటేశ్‌ను ఎంజీఎంహెచ్కి తరలించిన సమయంలో ఆరోగ్యస్థితి, చికిత్స అందించిన వివరాలను విచారించారు. ఆర్డీవో విచారణ, సబ్ జైలు నుంచి, గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి విషయం బయటకు తెలియకుండా ఉంచేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. సోమవారం ఉదయం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక ఫోరెన్సిక్ వైద్యుల బృందం మహబూబాబాద్ ఆర్డీవో కృష్ణవేణి పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించింది.