ఆలయ విశిష్టతను చాటేలా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం మధ్యాహ్నం తర్వాత సాధారణ భక్తులకు మూలవరుల దర్శన భాగ్యం విశిష్ట పర్వాల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటున్న సీఎం కేసీఆర్ హాజరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, ఇతర ప్రముఖులు ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకొన్నయాదాద్రి ఆలయం వెయ్యేండ్లకు పైగా చెక్కుచెదరకుండా నిలిచిపోయేలా నిర్మితమైంది. కాకతీయ, పల్లవ రాజ్యాలు, రాజులు కాలగర్భంలో కలిసిపోయినా వారి శిల్పకళా వైభవం యాదాద్రిలో కనిపిస్తుంది. ఆధార శిల మొదలుకుని గోపురాల దాకా రాతి స్తంభాలు, మండపాలు, శిల్పాలు ఇలా.. ప్రతి నిర్మాణం శిల్ప శాస్ర్తాన్ని బోధిస్తున్నాయి. కనుమరుగై పోయిన చరిత్రను చాటుతున్నాయి. సోమవారం మహాకుంభ సంప్రోక్షణ అనంతరం స్వయంభువులను దర్శించుకునే సందర్భంలో యాదాద్రి వైభవాన్ని భక్తులు మనసారా వీక్షించవచ్చు.
యాదాద్రి భువనగిరి, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీఎం హోదాలో 2014 అక్టోబర్ 17న తొలిసారిగా యాదాద్రిలో అడుగు పెట్టారు. యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదేరోజు ప్రకటన చేశారు.డిసెంబర్ 17న రెండోసారి, 2015 ఫిబ్రవరి 25న మూడోసారి, అదే ఏడాది మార్చి 5న జరిగిన కల్యాణంలో సతీసమేతంగా నాలుగోసారి పాల్గొన్నారు. మే 30న ఐదోసారి యాదాద్రిని సందర్శించి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. జూలై 5న ఆరోసారి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. 2016 అక్టోబర్ 19న పనులను పర్యవేక్షించారు. 2017 నవంబర్ 23న పర్యటించి ఆలయ పనులకు సంబంధించి పలు సూచనలు చేశారు. తొమ్మిదోసారి 2017 అక్టోబర్ 24న యాదాద్రిని సందర్శించిన సీఎం సుదీర్ఘ విరామం అనంతరం 2019 ఫిబ్రవరి 3న పదోసారి యాదాద్రికి విచ్చేసి అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అదే ఏడాది ఆగస్టు 17న 11వ సారి, డిసెంబర్ 17న 12వ సారి పర్యటించి పలు
సూచనలు చేశారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ ఆలయ పునర్నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్ 13న యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్ పనుల పురోగతిపై కీలక సూచనలు చేశారు. 2021 మార్చి 5, జూన్ 21న పర్యటించి పనుల వేగవంతానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 19న 16వ సారి పర్యటించి ఆలయ ప్రారంభోత్సవానికి సుముహూర్తాన్ని ప్రకటించారు. 17వ సారి ఈ ఏడాది ఫిబ్రవరి 7న పర్యటించి ముహూర్తం ముంగిట జరుగుతున్న పనులను పరిశీలించారు. ఫిబ్రవరి 12న ప్రెసెడెన్షియల్ సూట్స్‌ను ప్రారంభించారు. తాజాగా 19వ పర్యటనలో సీఎం కేసీఆర్ ఆలయ పునరవతరణ సందర్భంగా నిర్వహిస్తున్న మహాకుంభ సంప్రోక్షణకు కుటుంబ సమేతంగా వస్తున్నారు.
గుట్టకు చుట్టూ నాలుగు మార్గాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. రాయగిరి వైపు నుంచి వచ్చే వాహనాలను వడాయిగూడెం సన్నిధి హోటల్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటుచేశారు. వంగపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను జూనియర్ కళాశాల సమీపంలోని వెంచర్లో, తుర్కపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలను మల్లాపురం రింగ్‌రోడ్డు వద్ద, రాజాపేట నుంచి వాహనాలను సైదాపురం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కేవలం వీవీఐపీ, వీఐపీ వాహనాలను మాత్రమే కొండ కింద వరకు అనుమతించనున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకుల వాహనాలను కొండ కింద తులసి కాటేజీ వద్ద పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ప్రధానాలయంలో స్వయంభువుల దర్శనం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో బాలాలయంలో సోమవారం జరిగే పూజలు చివరివి కానున్నాయి. 2016 ఏప్రిల్ 21నుంచి కవచమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించగా సోమవారం ఉదయం 7.30 గంటలకు చివరిసారిగా నిత్యహోమాలు, చతుస్థానార్చనలు, పరివార శాంతి, ప్రాయశ్చిత్తహోమాలు జరిపి, కవచమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి వేంచేపిస్తారు.
భారీ బందోబస్తు
యాదాద్రి భువనగిరి, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు చేపడుతున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానాలయంతో పాటు, కొండ కింద, పట్టణంలోని అన్ని రహదారులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని రకాల ప్రొటోకాల్ సెక్యూరిటీలు, ఆలయ పరిరక్షణకు ఎస్పీఎఫ్ బృందాన్ని నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు ఆలయ ప్రాంగణంలో సివిల్ పోలీస్ బృందాల ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళా భక్తులకు సహాయ సహకారాలు అందించడానికి షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. ఆయన వెంట యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.
సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు, ఉన్నతస్థాయి అధికారులు వస్తుండడంతో 3వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో 10 మంది డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 96 మంది సీఐలు, 198 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు 180 మంది, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, 1,271 మంది హోంగార్డులు, 600 మంది ఏఆర్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.
ఉదయం 7.30 గంటలకు చివరిసారిగా బాలాలయంలో నిత్యహోమాలు, చతుస్థానార్చనలు, పరివార శాంతి, ప్రాయశ్చిత్తహోమాలు నిర్వహిస్తారు. అనంతరం 9 గంటలకు మహాపూర్ణాహుతి జరిపించి బాలాలయం నుంచి ఉత్సవమూర్తుల శోభాయాత్ర ప్రారంభిస్తారు. ప్రధానాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు పూర్తయ్యాక గర్భాలయంలో ఉత్సవమూర్తులను వేంచేపు చేస్తారు. ఈ శోభాయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారు.
మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా యాదాద్రి ప్రాశస్త్యాన్ని చాటేలా ఘన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి యాదాద్రి వరకు హైవేపై ప్రధాన ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, భారీ ఆర్చీలు ఏర్పాటు చేశారు. గుట్టకు నలుమూలల నుంచి వచ్చే దారుల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ప్రధానాలయాన్ని పూర్తిగా పూలతో అందంగా అలంకరించడంతోపాటు ఆలయ ప్రాంగణాలు, ముఖ్య దారుల్లో విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేశారు. లైటింగ్‌తో ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా విరాజిల్లుతోంది.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా చేపట్టిన ఏర్పాట్లను విద్యుత్ శాఖ మంత్రి గుంట్లకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఆదివారం సాయంత్రం ప్రధానాలయానికి చేరుకుని ఆలయంతో పాటు క్యూ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హరితహోటల్లో సీఎంఓ ముఖ్యకార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, వైటీడీఏ అధికారులతో సమీక్ష జరిపారు.
సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఇతర ప్రముఖులు యాదాద్రి ప్రధానాలయ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా యాదాద్రిలోని పలు బాధ్యతలను జిల్లా, మండల స్థాయి అధికారులకు కేటాయించారు. ప్రెసిడెన్షియల్ సూట్ బాధ్యతలను డీహెచ్ఎస్ఓ అన్నపూర్ణ, భువనగిరి తాసీల్దార్ వెంకట్‌రెడ్డి, రాజాపేట ఎంపీడీఓ నల్ల రామరాజు, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డికి అప్పగించారు. ఐటీ శాఖ మంత్రికి లైజనింగ్ అధికారిగా డీఆర్డీఏ అదనపు పీడీ నాగిరెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు లైజనింగ్ అధికారిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియను కేటాయించారు.
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సోమవారం ఉదయం 11.55 గంటలకు మిథునలగ్న సుముహూర్తాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా మహాకుంభాభిషేకంతో ప్రధానాలయం పునఃప్రారంభం కానుంది. అర్చకులు, రుత్వికులు, పారాయణీకులు, యజ్ఞాచార్యుల మంత్రోచ్ఛారణ, డోలు, సన్నాయిల మోతల మధ్య మహాక్రతువు కొనసాగనున్నది. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్, రాచకొండ కమిషనర్, ఆలయ అధికారులు చేపట్టారు.
దేవాలయ అవసరాలతోపాటు భక్తుల వసతికి సంబంధించిన పలు సముదాయాలను సోమవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే గండి చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. కొండపైన విష్ణు పుష్కరిణి, కొండ కింద లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్ట సిద్ధంగా ఉన్నాయి. దీక్షాపరుల మండపంలో భక్తులకు అన్నదానం ప్రారంభించనున్నారు. నిర్మాణం పూర్తయిన మూడో ఘాట్ రోడ్డును సైతం ప్రారంభించనున్నారు.
యాదాద్రీశుడిని దర్శించుకునే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు మొదటగా క్యూ కాంప్లెక్స్‌లో ఆన్లైన్ టికెట్ తీసుకోవాలి. క్యూకాంప్లెక్స్‌లో దాదాపు 8వేల మందికి పైగా వేచి ఉండే సామర్థ్యం ఉన్నది. వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంప్, ఎస్కలేటర్ సౌకర్యాలు కల్పించారు.