Madhusudhana Chary : చట్ట సభల్లో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చీకటి అధ్యాయమని మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనా చారి (Madhusudhana Chary) అభివర్ణించారు. మంగళవారం రాత్రి ఆయన శాసన మండలి మీడియా పాయింట్లో సహచర ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ.. సభ్యులపై పోలీసులను ఉసిగొల్పి దుర్మార్గంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిరికితనంతో పరారైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన స్థితిలో ఉందన్న మధుసూధనా చారి.. దేశ సరిహద్దుల్లో బలగాలను మోహరించినట్లుగా వందలాది మంది పోలీసులను పెట్టించి సభ్యులపై దాడికి పాల్పడిందని మండిపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను బీఆర్ఎస్ పక్షాన మేం ప్రశ్నిస్తే జవాబు లేదు, కాబట్టే ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభ నడిపించే ఎత్తుగడను ఈరోజు కూడా కొనసాగించారని మధుసూధనా చారి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనను ఆయన తప్పుపట్టారు. సహచర ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ రెడ్డిలపై కేసులు నమోదు చేయడం.. వారి సభ నుంచి బహిష్కరించేందుకు ఏకపక్షంగా తీర్మానం చేయడంపై మేం చర్చకు పట్టుబట్టగా రేవంత్ సర్కార్ సమాధానం చెప్పలేకపోయిందని ఆయన వెల్లడించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల దాకా వెయిటింగులో పెట్టి, ఎలాంటి చర్చ లేకుండా 3 నిమిషాల్లోనే సభను వాయిదా వేసి కాంగ్రెస్ ప్రభుత్వం పరారైందని మధుసూదనా చారి దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు.
శాసన మండలి చరిత్రలో ఇవాళ భయంకరమైన దుర్దినం అని మధుసూధనా చారి అభివర్ణించారు. మండలిలో ఇరవై మందికి పైగా సభ్యులున్న బీఆర్ఎస్ పక్షాన్ని ..ఏడెనిమిది మంది సభ్యులున్న కాంగ్రెస్ పక్షం తట్టుకోలేకపోతోందని ఆయన తెలిపారు. అందుకే తీర్మానాన్ని నెగ్గించుకునే అవకాశం లేక, ఆగమేఘాల మీద చదివి, మూడంటే మూడు నిమిషాల్లోనే పాస్ చేయించుకొని ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించి పరారైందని మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూధనాచారి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్లో మధుసూధనా చారితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎల్.రమణ, తాతా మధు, నవీన్ రెడ్డి, యాదవరెడ్డి, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఈరోజు తెలంగాణలో చట్టసభలు జరుగుతున్న తీరు చూస్తుంటే చీకటి రోజును తలపిస్తోంది.
శాసనసభను సజావుగా నడపడం చేతగాక,
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది కాబట్టి, ఇలా దుర్మార్గానికి తెర తీశారు.– శాసనమండలి ప్రతిపక్ష నేత @Sirikondatrs pic.twitter.com/I0hjZ5HqgE
— BRS Party (@BRSparty) September 8, 2026