Instamart : ఆన్లైన్లో ఆఫర్లుంటే చాలు ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తుంటాం. కానీ, వాటి క్వాలిటీ గురించి పెద్దగా పట్టించుకోం. అందుకే, ఇకపై అలా ఆర్డర్ చేయాలంటే కాస్త జాగ్రత్తగా ఆలోచించంది. ఎందుకంటే ఆన్లైన్ స్టోర్స్ అయిన ఇన్‌స్టామార్ట్, అమెజాన్ స్టోర్స్‌లో అనేక ఫుడ్ ప్రొడక్ట్స్ పాడైపోయినవి ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు స్టోర్స్‌లలో అధికారులు ఇటీవల దాడులు చేయగా ఇలా పాడైన ప్రొడక్ట్స్ భారీగా బయటపడ్డాయి.
ఈ ఆహార పదార్థాల విలువ రూ.1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు బెంగళూరులోని అనేకల్, హోస్కోటేతోపాటు పలు ప్రాంతాల్లోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, అమెజాన్ స్టోర్లపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడి ఫుడ్ స్టోర్లలో ఎక్స్పైర్ అయిన, తప్పుడు లేబుల్స్ కలిగిన పలు రకాల ఫుడ్ ప్రోడక్ట్స్‌ను అధికారులు గుర్తించారు. అనేక ఆహార పదార్థాల నిల్వకు తగిన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించడం లేదనే విషయాన్ని గుర్తించారు. ఇలా పాడైన, కుళ్లిన ఆహార పదార్థాల్ని అధికారులు సీజ్ చేశారు. ఆ స్టోర్స్‌ను కూడా మూసివేశారు.
ఇలా మొత్తంగా అమెజాన్, ఇన్స్టాగ్రామ్ స్టోర్స్‌లలో మొత్తం రూ.1.38 కోట్ల విలువైన ఫుడ్ ప్రోడక్ట్స్‌ను సీజ్ చేశారు. వీటిలో కాజు, రాగి పిండి, చికెన్ ప్యాటీ, పనీర్, కుకీస్, నట్స్, ఎగ్స్, పలు రకాల పిండి, ఇతర ప్యాకేజ్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే, కొన్ని ఆన్లైన్ మెడికల్ స్టోర్స్‌పై దాడి చేయగా 2.45 లక్షల విలువైన పాడైన మెడిసిన్స్‌ను గుర్తించారు. ఇటీవల బెంగళూరులో పెప్టైడ్ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించిన విచారణ జరుపుతుండగా.. బయటపడ్డ కొన్ని డాక్యుమెంట్లను పరిశీలించగా.. వివిధ ఆన్లైన్ స్టోర్స్ వ్యవహారం బయటపడింది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భారీ ఎత్తున అధికారులు పాల్గొన్నారు.