Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. శాసనమండలి, శాసనసభను వాయిదా వేసుకుంటూ పోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
అధికార పక్షాన్ని నిజాయితీగా ప్రశ్నించాలని అనుకుంటున్న పార్టీలు తమతో కలిసి రావాలని మధుసూదనాచారి పిలుపునిచ్చారు. హామీల అమలుపై ఈ ప్రభుత్వాన్ని నిజాయితీ, చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నామని మధుసూదనాచారి తెలిపారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది ద్రోహం, వంచన అని మండిపడ్డారు. ఏడాదికి రూ.20వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ బడ్జెట్లో కేటాయింపులు ఎలుక తోకలా ఉందని ఎద్దేవా చేశారు. బీసీలకు గత బడ్జెట్లలో కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదని అన్నారు.