Rohit Sharma | భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా క్రికెటర్ల జీవిత కథలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాల బయోపిక్‌లు మంచి విజయాన్ని సాధించాయి. త్వరలోనే సౌరవ్ గంగూలీ జీవిత కథ కూడా సినిమాగా రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జీవితం కూడా బయోపిక్‌గా రానుందనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. టీమిండియాకు దూకుడు అందించిన ఓపెనర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో విజయాలు సాధించిన రోహిత్ శర్మ జీవితాన్ని సినిమాలో చూపించడానికి పలువురు దర్శకులు కసరత్తులు చేస్తున్నారు. సాధారణ స్థాయి నుంచి ఎదిగి, భారత జట్టుకు కీలక విజయాలు అందించిన ఆయన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.
టెస్ట్‌లు, వన్డేలు, టీ20లలో కలిపి 20 వేల పరుగులకు పైగా చేసిన అరుదైన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ సరసన చోటు సంపాదించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, అత్యధిక స్కోరు 264, అత్యధిక సిక్సర్ల రికార్డులు ఇవి అతని కెరీర్‌ను ప్రత్యేకంగా నిలిపాయి. ఇదిలా ఉంటే, రోహిత్ శర్మ బయోపిక్‌లో నటించే హీరోగా టాలీవుడ్ నటుడు శర్వానంద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఫిజిక్, లుక్ రోహిత్ పాత్రకు సరిపోతాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఇటీవల ‘బైకర్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయంపై స్పందించిన శర్వానంద్, “రోహిత్ శర్మ బయోపిక్ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ నా పేరు వినిపిస్తున్నట్టు వింటున్నా. కథ నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆలోచిస్తాను. రోహిత్ జీవితం చాలా ప్రేరణాత్మకమైనది” అని తెలిపారు.
అదే సమయంలో ఈ ఈవెంట్లో పాల్గొన్న సీనియర్ నటుడు రాజశేఖర్ సరదాగా స్పందిస్తూ, “అతను రోహిత్ శర్మ అయితే నేను ధోనీ అవుతా” అని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. మొత్తానికి, రోహిత్ శర్మ బయోపిక్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. శర్వానంద్ స్పందనతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది. అభిమానులు కూడా ఈ బయోపిక్ త్వరగా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.