Dulquer Salmaan | మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇళ్లల్లో కస్టమ్స్ అధికారులు ఇటీవల అకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ నమకూర్’(Operation Numkhor) పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌పై కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే దుల్కర్ వద్ద ఉన్న 2004 మోడల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వాహనానికి సరైన పత్రాలు లేకుండా అక్రమ మార్గంలో దిగుమతి అయ్యాయని పన్ను ఎగవేతకు పాల్పడ్డారని కస్టమ్స్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తన లగ్జరీ కారును విడుదల చేయాలని కోరుతూ దుల్కర్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
దుల్కర్ తన పిటిషన్లో పేర్కొంటూ.. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తన 2004 ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ICRC) ద్వారా న్యూఢిల్లీలోని ఐసీఆర్సీ ప్రాంతీయ ప్రతినిధి కార్యాలయానికి రవాణా చేయబడి కన్సైన్మెంట్ బిల్లు (Bill of Entry) ద్వారా క్లియర్ చేయబడిందని దుల్కర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ వాహనానికి మోటార్ వెహికల్ అథారిటీ నుంచి రిజిస్ట్రేషన్ జరిగిందిని అన్నారు. ఆ కారును ‘ఆర్పీ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి కొనుగోలు చేశానని ఆ సంస్థ దానిని హబీబ్ మొహమ్మద్ అనే వ్యక్తి నుండి తీసుకుందని అతని పేరు మీదే అది రిజిస్టర్ అయి ఉందని దుల్కర్ వివరించారు. వాహన పత్రాలను పరిశీలించకుండా కస్టమ్స్ అధికారులు తొందరపాటుగా కారును స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు కారు నిరుపయోగంగా ఉండిపోతే వాతావరణ పరిస్థితుల వల్ల అది పాడైపోతుందని, అందుకే దాన్ని తనకు విడుదల చేస్తే కండీషన్లో ఉంచుతానని ఆయన హామీ ఇచ్చారు. అందుకే జప్తు మెమోను రద్దు చేసి వాహనాన్ని తనకు విడుదల చేయాలని కోరారు.
దుల్కర్ సల్మాన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కేరళ హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌ను (Customs Preventive Department) వివరణ కోరింది. అలాగే తదుపరి విచారణను సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది.