Bala Krishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు (శనివారం) ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బాలకృష్ణ ఆలయానికి చేరుకోగానే అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ, “లలితా త్రిపురసుందరీ అలంకారంలో దుర్గమ్మను దర్శించడం ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి దయాభిక్ష ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించాను” అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరా సందర్భంగా తండోపతండాలుగా భక్తులు కఠోర దీక్షలతో అమ్మవారి దర్శనానికి వస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని, ఆమె ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై చేపట్టిన దసరా ఏర్పాట్లు ఎంతో సజావుగా ఉన్నాయని ఎమ్మెల్యే బాలకృష్ణ అభినందించారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, నిరంతర దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రశంసించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు చర్యలు తీసుకున్న దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ2 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ఈ సినిమాని డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. అఖండ చిత్రం పెద్ద విజయం సాధించడంతో అఖండ 2పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక గోపిచంద్ మలినేనితో కూడా బాలయ్య ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.