హుజూరాబాద్ రూరల్, మార్చి 31 : గ్యాస్ సిలిండర్ వచ్చిందని ఓ మహిళను ఇంటి నుంచి తీసుకెళ్లాడు ఓ ఆగంతకుడు. ఆమెను ఓ చోట ఉంచి మరో మహిళను తీసుకొస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. ఈ ఘటన హుజూరాబాద్ మండలం కందుగులలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుడిపాటి ఆగమ్మ ఒంటరిగా ఉంటున్నది.
సోమవారం ఉదయం ఆరుబయట దుస్తులు ఉతుకుతుండగా గుర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి గ్యాస్ సిలిండర్ వచ్చిందని, సంతకం చేసి తీసుకోవాలని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి తన కొడుకు 4 రోజుల క్రితమే గ్యాస్ తెచ్చాడని చెప్పింది.
‘మీ కొడుకే చెప్పాడు’ అని చెప్పి ఆమెను బైక్పై ఎక్కించుకొని గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. అక్కడ దింపి, మరో మహిళను తీసుకువస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకూ రాకపోవడంతో ఆగమ్మ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం దిండుకింద దాచిన సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పింది. గ్యాస్ వచ్చిందని చెప్పి సదరు వ్యక్తి మోసం చేశాడని గుర్తించి హుజూరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టౌన్ సీఐ కరుణాకర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.