ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగిన అమెరికా ఇప్పుడొక సందిగ్ధ స్థితికి చేరుకున్నది. బల ప్రదర్శన కోసం కయ్యానికి కాలుదువ్విన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది. అంతా నా ఇష్టం అంటూ దూకుడుగా సైనిక దాడులకు తెగబడిన ట్రంప్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. యుద్ధం త్వరగానే ముగించవచ్చని అతి విశ్వాసానికి పోయిన ట్రంప్, యుద్ధంలో ఉద్భవించిన సమస్యల్లో చిక్కుకొని, ముగింపు పలికేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. యుద్ధం అపడమంటే, మొదలు పెట్టినంత సులభం కాదనే సంగతి ట్రంప్‌కు ఆలస్యంగా అర్థమైనట్టు కనిపిస్తున్నది. తాజాగా బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు తమతో కలిసి రావడంలేదని ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయా దేశాలు హొర్ముజ్ వెళ్లి చమురు తెచ్చుకోవాలని అసహనం ప్రదర్శించారు. ఇదంతా ట్రంప్‌లో రోజురోజుకు పెరుగుతున్న నిరాశ, నిస్పృహలకు నిదర్శనం.
ప్రపంచపు పెద్దన్నగా తనకు తానే జవాబుదారీ అంటూ ప్రకటనలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధంలో గెలిచితీరుతానని అనుకున్నారు. కానీ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టుగా యుద్ధరంగంలో అమెరికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. తాజాగా కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేస్తున్న దాడుల నేపథ్యంలో అక్కడ అధికార మార్పుతో కీలక దశకు చేరుకున్నట్టేనని చెప్పుకొచ్చారు.
ఇరాన్ అగ్రనేతల మరణాల నేపథ్యంలో ఆ దేశంతో త్వరలోనే ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. కానీ ట్రంప్ చెప్తున్న మాటలు నమ్మశక్యంగా లేవని ప్రపంచ వ్యాప్తంగా స్వతంత్ర మీడియా, అధ్యయన సంస్థలు చెప్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టే అంటూ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన పట్ల బీబీసీ ఓ విశ్లేషణ వెలువరించింది. ‘అమెరికా తన బలప్రదర్శన త్వరగానే ముగించాలని అనుకున్నది.
కానీ అది పెద్ద సమస్యగా మారి మెడకు చుట్టుకున్నది. కొన్నిసార్లు యుద్ధం మొదలు పెట్టడం కంటే ముగించడమే ఎక్కువ కష్టం’ అని పేర్కొన్నది. ఇప్పుడు ట్రంప్ ముందున్న మార్గాలేంటి? అనే కోణంలోనూ విశ్లేషించింది. ఇరాన్‌లోకి మరింతగా చొచ్చుకెళ్లి అమెరికా యుద్ధాన్ని తీవ్రం చేస్తే ఏం జరుగుతుంది? లేదా గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక బలగాలను భారీగా మోహరిస్తే ఏం జరుగుతుంది? ఈ రెండింటిలో ఏం చేసినా కూడా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్న శక్తులు బరిలోకి దిగవచ్చు. అప్పుడు హొర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు తలెత్తితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. అమెరికా గత యుద్ధాలను పరిశీలిస్తే మనం ఓ విషయం గమనించవచ్చు. అధిక సైనిక బలగాల ప్రయోగం ప్రతిసారి సత్ఫలితాలు ఇస్తుందని కచ్చితంగా చెప్పలేం.
ఇక అమెరికా ముందున్న మరో మార్గం.. గెలువకపోయినా విజయాన్ని ప్రకటించడం. ఇది రాజకీయపరమైన ప్రత్యామ్నాయం. యుద్ధంలో తమదే పైచేయి అయిందని, తామే గెలిచామని చెప్పుకొంటూ వెనక్కి తగ్గడం. బీసీసీ విశ్లేషణ ప్రకారం విస్తృత ప్రయోజనాలు నెరవేరకపోయినా పరిమితమైన లాభాలను వ్యూహాత్మక విజయంగా చాటుకోవడమే ఈ మార్గం వల్ల కలిగే ఉపయోగం. కానీ ఇది విశ్వసనీయతకు భంగం కలిగించే ప్రమాదమున్నది. కానీ ఆధునిక పరిస్థితుల్లో వాస్తవాలకు విరుద్ధమైన ప్రచారంలో నిజానిజాలను దాచడం, క్షేత్రస్థాయి పరిస్థితులకు, ప్రచారానికి పొంతన ఉన్నదా లేదా అనే పరీక్షలో నెగ్గడం కష్టం.
ప్రపంచంలోనే బలమైన సైనిక శక్తి, తిరుగులేని అధికారం అంటూ ప్రచారం, పేరు కలిగిన అమెరికాకు.. ఇరాన్‌తో యుద్ధంలో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా సైనిక బల ప్రదర్శన ముందు ఇరాన్ త్వరగా తలొగ్గుతుందని అమెరికా భావించింది. కానీ అగ్రరాజ్యం లెక్క తప్పింది. అమెరికా దాడుల్లో అగ్రనాయకత్వం చనిపోయినా ఇరాన్ అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించింది. సంస్థాగతంగా బలాన్ని కనబర్చింది. అలాగే అసమాన ప్రతీకార చర్యలతో తన రుజువు చేసుకున్నది. అమెరికా ఇప్పటి దాకా తలపడిన వంటిది కాదు ఇరాన్. ఆ దేశాన్ని సులభంగా ఓడిస్తామని భావించడం అమెరికా తప్పుడు అంచనా. ఇరాన్ ప్రాంతీయంగా బలమైన వ్యూహాత్మక నిర్మాణం కలిగిన దేశం. కాబట్టి అలాంటి దేశంతో యుద్ధంతో తక్షణమే ఫలితాలు సాధించాలని చూడటం ప్రమాదకరం అని బీబీసీ తన విశ్లేషణలో పేర్కొన్నది.
ఇరాన్‌పై అమెరికా చేసిన యుద్ధం సంప్రదాయ వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇలాంటి ఉద్రిక్తతలను మరింతగా సాగతీయడం అంటే విస్తృత, సుదీర్ఘ సంఘర్షణకు దారితీస్తుంది. అదే సమయంలో యుద్ధం నుంచి వైదొలిగితే అసమర్థులుగా కనిపించే ప్రమాదం ఉంటుంది. అందుకు ఈ యుద్ధమే ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. యుద్ధాలు తరచుగా నాయకులు అనుకోని పరిణామాలకు దారి తీస్తాయి. అప్పుడు విజయం దక్కకపోవచ్చు. కొన్నిసార్లు అందుబాటులో ఉన్న వాటిలో ఏదో ఓ నిర్ణయం తీసుకోకతప్పని కష్టమైన పరిస్థితి మాత్రమే మిగులుతుంది అని ‘ది గార్డియన్’ పత్రిక అభివర్ణించింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం ఆ రెండు దేశాలకు పరిమితం కాదు. ఉద్రిక్తతలు మరింతగా పెరిగితే ఇంధన మార్కెట్లలో అస్థిరత ఏర్పడుతుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు వ్యాపిస్తాయి. గల్ఫ్ స్థిరత్వం దెబ్బతింటే భారత్ వంటి దేశాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇరాన్‌తో యుద్ధం ట్రంప్‌కు గుణపాఠం. ఈ పరిస్థితిని చక్కదిద్దడం ట్రంప్ ముందున్న పెద్ద పని. ఇప్పుడు అమెరికాకు అత్యంత కష్టమైన పని ఏంటంటే యుద్ధాన్ని కొనసాగించడం కాదు, యుద్ధం నుంచి బయటపడే మార్గాన్ని వెతకడం.
– ఎడిటోరియల్ డెస్క్