Buchi Babu | దర్శకుడు బుచ్చిబాబు సన ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారిపోయారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో బుచ్చిబాబు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు.అయితే ఆయన కేవలం సినిమాల ద్వారానే కాదు, తన మంచి మనసుతో కూడా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బుచ్చిబాబు వెల్లడించిన విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బుచ్చిబాబు స్వస్థలం పిఠాపురం. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ పట్టణం అనేక ప్రసిద్ధ ఆలయాలకు నిలయంగా ఉంది. ముఖ్యంగా కుక్కుటేశ్వర స్వామి ఆలయం,శక్తిపీఠాల్లో ఒకటైన పురుహూతికా దేవి ఆలయం, దత్తాత్రేయస్వామి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.తనకు పిఠాపురం అంటే ఎంతో ఇష్టమని, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని బుచ్చిబాబు అనేక సందర్భాల్లో చెప్పారు.‘పెద్ది’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దత్తాత్రేయ స్వామి ఆలయం సమీపంలో ఒక హోటల్ తరహా భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే అది కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే కాదని, సామాజిక సేవ లక్ష్యంగా కూడా ఆ ప్రాజెక్ట్ను చేపడుతున్నట్లు చెప్పారు.దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద ఒక హోటల్ నిర్మిస్తున్నాను. అందులో కొన్ని గదులను అక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని బుచ్చిబాబు వెల్లడించారు. ఇంతటితో ఆగకుండా, ఆ హోటల్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సమాజానికి తిరిగి అందించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఆ హోటల్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని బాగా చదువుకునే పేద విద్యార్థుల విద్య కోసం వినియోగించాలని అనుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోకుండా వారికి సహాయం చేయాలనేది నా కోరిక అని బుచ్చిబాబు చెప్పారు.ఆయన మంచి పనుల గురించి తెలుసుకున్న నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు .