Bandla Ganesh | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై వివిధ రాజకీయ పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, ఇప్పుడు ఈ వివాదం సినీ పరిశ్రమకు కూడా విస్తరించింది. ముఖ్యంగా ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం హాట్ టాపిక్‌గా మారింది. సామాజిక, రాజకీయ అంశాలపై తరచూ స్పందించే ప్రకాష్ రాజ్, తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. “మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? సింగిల్‌గా వస్తున్నారా? చెప్పి రండి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, ఈ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించినవేనని రాజకీయ వర్గాలు, నెటిజన్లు భావించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేష్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలోనే ఆయనకు కౌంటర్ ఇస్తూ, “ప్రతి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు?” అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా పలు టెలివిజన్ చర్చా కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రకాష్ రాజ్ వైఖరిని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం సరైనది కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే బండ్ల గణేష్ తాజా వ్యాఖ్యల కంటే, ఆయన గతంలో ప్రకాష్ రాజ్ గురించి చెప్పిన మాటలే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గతంలో జరిగిన మా ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ బహిరంగంగా ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, ఆయన మంచితనం గురించి బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. “ప్రకాశ్ రాజ్ గొప్ప వ్యక్తి”, “విలువలు ఉన్న మనిషి”, “సేవా దృక్పథం కలిగిన వ్యక్తి” అంటూ కొనియాడారు. ఇప్పుడు అదే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు బండ్ల గణేష్‌ను ప్రశ్నిస్తున్నారు. “అప్పుడు ప్రకాష్ రాజ్ గొప్ప వ్యక్తి అన్నారు.. ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మా ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రెస్మీట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ, తాను దాదాపు 23 సంవత్సరాలుగా ప్రకాష్ రాజ్‌ను చూస్తున్నానని చెప్పారు. ఆయనతో ఎన్నో అనుభవాలు ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి అని కొనియాడారు. అలాగే తెలంగాణలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని, ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. “లోకల్-నాన్ లోకల్ అనే చర్చ అవసరం లేదు. ఇక్కడ నివసిస్తూ ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తిని మనవాడిగానే చూడాలి” అని అప్పట్లో వ్యాఖ్యానించారు.
#PrakashRaj పై కొన్ని వందల సార్లు ఇరిటేషన్ ఫీల్ అయ్యాను … కానీ అతన్ని కొన్ని లక్షల సార్లు ప్రేమించాను: #BandlaGanesh pic.twitter.com/rEvGqmo4NA
— Filmy Focus (@FilmyFocus) June 5, 2026