నంగునూరు, మార్చి 31: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేతిలో చికింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన చెక్‌డ్యామ్ అక్రమారుల ధనదాహానికి బలైపోతోంది.ప్రభుత్వ నిబంధనల ప్రకారం వంతెనలు, చెక్‌డ్యామ్‌ల వంటి కట్టడాలకు వంద మీటర్ల సమీపంలో ఎలాంటి ఇసుక తవ్వకాలు జరపకూడదు కానీ ఇసుక మాఫియా పట్టించుకోవడం లేదు.
రాతి కట్టడాన్ని కూల్చి.. దారి చేసుకుని..
ఇసుక రవాణాకు అడ్డుగా ఉన్న చెక్‌డ్యామ్ ను (రాతి కట్టడం) ఇసుక అక్ర మ రవాణా చేసే వ్యాపారులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్లు, వాహనాలు వాగులోకి వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వ నిర్మాణాన్ని కూల్చివేసి దారి నిర్మించుకున్నారంటే వారి తెగింపు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయలతో నిర్మించిన గోడలను కూల్చివేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
పెద్దవాగు నుంచి అడ్డూఅదుపు లేకుండా ఇసుక తరలించడంతో భూగర్భజలాలు భారీగా తగ్గాయి. వాగు పరీవాహక ప్రాంతాల్లోని బోరు, బావుల్లో నీటి మట్టం తగ్గిందని, కండ్లముందే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొందరి స్వార్థం కోసం వేల ఎకరాల సాగునీటి వనరులను హరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాతా గ్రామ పరిధిలో ఇసుక తవ్వకాలకు, ఇతర అనుమతులు తీసుకొని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు. అధికారుల అనుమతులు, ప్రకటనలు ఇవ్వడం కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని,వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.