న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ అరుదైన ఘనత సాధించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న లక్ష్యసేన్.. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన పిన్న వయసు భారతీయుడిగా నిలిచాడు. డిసెంబర్ ఒకటి నుంచి బాలి వేదికగా ప్రారంభం కానున్న సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత్ నుంచి కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధుతో పాటు సింగిల్స్ లక్ష్యసేన బరిలో దిగనున్నాడు. డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట కూడా పోటీలో ఉంది. కరోనా ప్రభావానికి ముందు ఐదు టైటిల్స్ సాధించిన 20 ఏండ్ల లక్ష్యసేన్.. తాజాగా డెన్మార్క్ మాస్టర్స్, హైలో ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడంతో పాటు దుబాయ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి సత్తాచాటాడు.