Fuel prices : ఇప్పటికే ఎల్పీజీ ధరల భారీ పెంపుతో ప్రజలకు షాకిచ్చిన కేంద్రం త్వరలో మరో షాకివ్వబోతున్నట్లు సమాచారం. పెట్రో ధరల్ని కూడా కేంద్రం పెంచబోతున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ సహా గృహ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై అధికారిక ప్రకటన రానప్పటికీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం ధరలు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా అంచనా ప్రకారం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4–5, గృహ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.40–50 వరకు పెరిగే అవకాశం ఉంది. 2022 తర్వాత కేంద్రం ఒకేసారి ఈ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచనుండటం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమరు ధరలు పెరుగుతున్నాయి. అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరలు పెంచడం అనివార్యం అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇటీవలే ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెరిగే అవకాశం లేదని తెలిపింది.
కానీ, వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 ధర పెంచింది. ఇప్పుడు పెట్రోల్ ధరల పెంపునకు సిద్ధమవుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి తగ్గడం, రవాణాకు ఆటంకాలు ఏర్పడటం, బ్యారెల్ చమురు ధర భారీగా పెరగడం వల్ల దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ధరలు పెంచకపోతే కంపెనీలు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అయితే, సబ్సిడీలు పెంచడం, పన్నులు తగ్గించడం వల్ల వినియోగదారులపై కొంత భారం తగ్గే ఛాన్స్ ఉంది.
ఈ అంశంపై మరో 5–7 రోజుల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ధరలు ఇలాగే పెరిగితే, సాధారణ ప్రజలపై, వ్యాపార సంస్థలపై భారం పడుతుంది. మరోవైపు ప్రజా రవాణా, సరుకు రవాణాపై కూడా అధిక భారం తప్పదు.