కరకగూడెం, మే 01 : కరకగూడెం- చిరుమళ్ల గ్రామాలను కలుపుతూ పెద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా కోతకు గురై రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తాత్కలికంగా ట్రాక్టర్ల సహాయంతో మట్టిని పోసి మరమ్మతులు చేపట్టారు. అయితే గతేడాది మే నెలలో ప్రభుత్వం వంతెన మరమ్మతులకు పంచాయతీరాజ్ నిధుల నుండి రూ.20 లక్షలు మంజూరు చేసింది. రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ హుటాహుటిన వంతెనకు ఒకవైపు మాత్రమే సైడ్ గోడ కట్టి పనులను నిలిపివేశాడు. వాస్తవానికి వంతెన వరద తాకిడికి, కోతకు గురికాకుండా వంతెన రెండు వైపులా సైడ్ వాల్ నిర్మించాలి. కానీ ఒకవైపు మాత్రమే కట్టి పనులు నిలిపివేయడంతో చేసిన పని పూర్తిగా వృథా అయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు.
ఇంకో నెల రోజుల్లో వానాకాలం సమీపిస్తుండడంతో వర్షాలకు మళ్లీ వంతెన అసంపూర్తి పనులతో కోట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం పలు గ్రామాలకు రాకపోకలు జరిగే వంతెనపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండడంతో వాహనదారులు, గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా చేసిన పనుల వల్ల ప్రజాధనం వృథాతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వంతెనకు రెండోవైపు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

అసంపూర్తిగా చిరుమళ్ల -కరకగూడెం వంతెన మరమ్మతు పనులు
అసంపూర్తి పనులు చేపట్టి ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందని కరకగూడెం మాజీ సర్పంచ్ తాటి సరోజని అన్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఇటువంటి పనులు చేస్తున్నారన్నారు. వంతెన మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రాబోయే వర్షాకాలంలో వరదలకు కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వంతెనకు ఒకవైపు మాత్రమే సైడ్ వాల్ కట్టి మరోవైపు వదిలివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
చిరుమళ్ల- కరకగూడెం గ్రామాల మధ్య వంతెన మరమ్మతులకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు పనిచేశాం. రూ.20 లక్షలు మంజూరు కాగా ఒక వైపు మాత్రమే సైడ్ వాలుకు నిధులు సరిపోయాయి. మళ్లీ ఏదైనా అనుమతి వస్తే మిగితా పని పూర్తి చేస్తాం.