నర్సింహులపేట, మే 3 : గ్యాస్ సిలిండర్ల కోసం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలకేంద్రంలోని గ్యాస్ గోదాం వద్ద శనివారం రాత్రి నుంచి వినియోగదారులు పడిగాపులుకాచారు. ఆదివారం ఉదయం వరకు కూడా సిలిండర్ల లారీ రాకపోవడంతో జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఆ తర్వాత సిలిండర్ల వాహనం రావడంతో నర్సింహులపేట, దంతాలపల్లి పోలీసుల పహారా నడుమ వినియోగ దారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.
రాత్రి మొత్తం జాగారం చేసినా చాలామంది వినియోగదారులకు సిలిండర్లు దొరక్కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ కేవైసీ పేరుతో ఓటీపీలు తీసుకున్న ఏజెన్సీ నిర్వాకులు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుక్ చేసిన వారికి సిలిండర్లు ఇస్తామని ఖాళీ సిలిండర్లు తీసుకొని, ఇప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు.