మెదక్, మే 3(నమస్తే తెలంగాణ)/కంది: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని, కేంద్రం నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదని చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించారు. సంగారెడ్డి, మెదక్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయాల్లో విలేకరుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిధులు లేవని సాక్షాత్తు సీఎం రేవంతే చెప్పారని గుర్తుచేశారు.
తెలంగాణలో రైతు బతికున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణం అన్నారు. కాంగ్రెస్ నేతలు చిప్ప చేతిలో పట్టుకొని నిధుల కోసం ఢిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలుస్తున్నారని, ఇక్కడికి వచ్చి మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరీ చిప్ప చేత పట్టుకుని ఢిల్లీకి ఎందుకు పోతున్నారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు దేశంలోనే ఎక్కు వ యూరియా కేటాయింపులు చేస్తున్నామన్నారు. ఈనెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్నారని, 10లక్షల మందితో పెరేడ్ గ్రౌండ్లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం ఇండియా అని, యుద్ధ సంక్షోభంలో పెట్రోల్ రేట్లు తప్పనిసరిగా పెరుగుతాయని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో పార్లమెంట్లో మూడు బిల్లులు అమోదం పొందలేవన్నారు. ఓబీసీ వర్గాలపై కాంగ్రెస్‌కు నిజమైన చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో రాజ్యాంగ సవరణ చేసినప్పడు బీసీల పట్ల వివక్ష చూపించారన్నారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేశ్‌గౌడ్, నాయకులు గడ్డం శ్రీనివాస్, పరిణిత, నాయినిప్రసాద్, రంజిత్‌రెడ్డి, కౌన్సిలర్లు రాజమణి, అఖిల, భరత్, తదితరులు పాల్గొన్నారు.