Low Immunity | సీజన్లు మారినప్పుడు, వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు, లేదా ఒకరి నుంచి మరొకరికి పలు వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. దగ్గు, జలుబు ఫ్లూ వంటివి ఈ కోవకు చెందుతాయి. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇవి త్వరగా వస్తాయి. రోజుల తరబడి అలాగే ఉంటాయి. ఒకవేళ తగ్గినా కొన్ని రోజులకు మళ్లీ వస్తుంటాయి. అయితే రోగాలు రాకుండా ఉండేందుకు గాను రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం అవసరం. రోగ నిరోధక శక్తి తగినంతగా లేకపోతే తరచూ రోగాల బారిన పడాల్సి ఉంటుంది. కరోనా సమయంలోనూ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిపైనే వైరస్ ఎక్కువగా ప్రభావం చూపించింది. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఎవరిలో అయినా సరే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని ఎలా తెలుస్తుంది..? రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి..? వంటి విషయాలను వైద్యులు వెల్లడిస్తున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే అలాంటి వారికి తరచూ దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. ఒక పట్టాన తగ్గవు. తగ్గినా మళ్లీ మళ్లీ వస్తాయి. తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే తీవ్రమైన ఒత్తిడి బారిన పడతారు. ఎవరైనా ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటున్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని భావించాలి. ఒత్తిడి లేదా డిప్రెషన్ అధికంగా ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గుతుంది. దీంతో వారు తరచూ సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. తరచూ జీర్ణ సమస్యలు వస్తున్నా కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని భావించాలి. ముఖ్యంగా ఇలాంటి వారికి పొట్టలో ఎల్లప్పుడూ అసౌకర్యంగా ఉంటుంది. తిన్న వెంటనే విరేచనానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ సమస్యలు కూడా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని తెలియజేస్తాయి.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే గాయాలు, పుండ్లు మానడం కూడా ఆలస్యం అవుతుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇలా జరుగుతుంది. కానీ మీకు డయాబెటిస్ లేకపోయినా గాయాలు, పుండ్లు ఆలస్యంగా మానుతున్నాయంటే మీలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చర్మ ఇన్ఫెక్షన్లు లేదా బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఇవి రోగాలను కలగజేస్తాయి. ముఖ్యంగా తరచూ జ్వరం వస్తుంది. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాయి. అలాగే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు అసలు ఏ పనిచేయకపోయినా తీవ్రంగా అలసిపోయినట్లు ఫీలవుతారు. తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. ఇలా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న విషయాన్ని సులభంగా గుర్తించవచ్చు. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
సిట్రస్ జాతికి చెందిన నిమ్మ, నారింజ వంటి పండ్లను రోజూ తింటుంటే ఇమ్యూనిటీ అధికంగా పెరుగుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జింక్ అధికంగా ఉండే చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, మటన్ లివర్, పప్పు దినుసులు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, అవిసె గింజలు, చియా విత్తనాలు, బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్‌ను తింటున్నా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ రాత్రి పూట పసుపును పాలలో కలిపి తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. రాత్రి పూట భోజనం చేసిన తరువాత దాల్చిన చెక్క వేసి మరిగించిన నీళ్లను తాగవచ్చు. లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకుని నమిలి తినవచ్చు. భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసాన్ని రోజుకు 2 సార్లు సేవిస్తుండాలి. చేపలను వారంలో కనీసం రెండు సార్లు తినాలి. ఇలా ఆయా ఆహారాలను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని సులభంగా పెంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.