Kids Eye Sight | పూర్వం ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారికి మాత్రమే కంటి చూపు తగ్గేది. కానీ ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. చిన్నారులు ఆ వయస్సు నుంచే కళ్లద్దాలను ధరించాల్సిన దుస్థితి నెలకొంది. అయితే కంటి చూపు సమస్యకు పోషకాహార లోపమే ప్రధాన కారణమని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు జంక్ ఫుడ్‌కు బాగా అలవాటు పడ్డారని, పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం లేదని, దీని వల్లే వారిలో కంటి చూపు మందగిస్తుందని అంటున్నారు. అయితే చిన్నారులకు ఇప్పటి నుంచే పోషకాలు ఉండే ఆహారాలను పెడితే దాంతో వారి కంటి చూపు మెరుగు పడడమే కాదు, వారు కళ్లద్దాలను వాడాల్సిన అవసరం తప్పుతుంది. అలాగే వారు పెద్దయ్యాక కూడా కంటి చూపు సమస్య రాదు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకు గాను వారికి రోజూ కొన్ని ఆహారాలను ఇవ్వాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
చిన్నారులకు రోజూ కచ్చితంగా ఒక క్యారెట్‌ను తినిపించాలి. వారు క్యారెట్‌ను నేరుగా తినకపోతే ఏదైనా ఇతర ఆహారాలతోపాటు కలిపి ఉడికించి పెట్టాలి. లేదా క్యారెట్ జ్యూస్‌ను రోజూ ఒక కప్పు మోతాదులో వారిచే తాగించాలి. క్యారెట్లను వారికి రోజూ పెట్టడం వల్ల కావల్సినంత బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మార్పు చెందుతుంది. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లు సురక్షితంగా ఉంటాయి. అలాగే చిన్నారులకు రోజూ బచ్చలికూర, పాలకూరను పెడుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. తోటకూర కూడా మేలు చేస్తుంది. కరివేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకులను కూడా పెట్టవచ్చు. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. ఆకుకూరల్లో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్లను రక్షించి కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి. కనుక ఆయా ఆకుకూరలను రోజూ చిన్నారులకు పెడుతుంటే వారికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇక చిన్నారుల కంటి ఆరోగ్యానికి, కంటి చూపు మెరుగు పడేందుకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మేలు చేస్తాయి. ఇవి ఎక్కువగా చేపలతోపాటు చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్ నట్స్, కోడిగుడ్లు, బాదంపప్పు వంటి ఆహారాల్లో ఉంటాయి. అందువల్ల వీటిని కూడా పిల్లలకు రోజూ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో వారి కళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చు. ఇక క్యాప్సికంను కూడా పిల్లలకు తరచూ పెడుతుండాలి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కళ్లలోని రక్త నాళాలకు మేలు చేస్తుంది. ఆయా రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా చూడవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తింటే మేలు జరుగుతుంది. దీని వల్ల విటమిన్ సితోపాటు విటమిన్ ఎ ను కూడా పొందవచ్చు. ఇవి రెండూ చిన్నారుల కళ్లను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపు మెరుగు పడేలా చేస్తాయి.
చిలగడదుంపలను కూడా చిన్నారులకు తరచూ పెడుతుండాలి. వీటిల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపు పెరిగేలా చేస్తుంది. ఈ దుంపలను తరచూ ఉడకబెట్టి వాటిపై కాస్త నెయ్యి వేసి చిన్నారులకు తినిపించాలి. దీని వల్ల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇక చిన్నారుల కంటి ఆరోగ్యం మెరుగు పడాలంటే వారికి పైనాపిల్ పండ్లను కూడా తరచూ తినిపించాలి. వీటిని తింటే కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. కళ్లు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక చిన్నారుల కంటి చూపు మెరుగు పడేందుకు డ్రై యాప్రికాట్స్ కూడా మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్లు ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను రక్షిస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇక చిన్నారుల కళ్ల ఆరోగ్యం కోసం వారికి తరచూ బెండకాయలను కూడా పెట్టాలి. అలాగే బ్రోకలీ, పర్పుల్ కలర్లో ఉండే క్యాబేజీ వంటి వాటిని కూడా పిల్లలకు తరచూ తినిపిస్తుండాలి. ఇవన్నీ వారి కళ్ల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతోపాటు కంటి చూపు పెరిగేలా చేస్తాయి. దీని వల్ల చిన్నారుల కళ్లు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటాయి.