Smriti Mandhana : క్రికెట్ మైదానంలో బౌలర్లకు దడ పుట్టించే స్మృతి మంధాన (Smriti Mandhana) తన పెళ్లి వేడుకల్లో అదరగొడుతోంది. హల్దీ, మెహందీతో పాటు సంగీత్లోనూ మంధాన ఖతర్నాక్ డాన్స్‌తో అందరినీ ఫిదా చేసింది. కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ (Palash Muchhal)తో కలిసి బాలీవుడ్ లవ్ బీట్‌కు భారత వైస్ కెప్టెన్ సూపర్ స్పెప్పులేసింది. టీమిండియా క్రికెటర్లు సైతం డాన్స్ చేస్తూ సహచరి మంధానకు వివాహ వేడుకకు మరింత వన్నె తెచ్చారు. ప్రస్తుతం నెట్టింట మంధాన – పలాశ్ డాన్స్‌తో పాటు విశ్వ విజేతల వీడియో వైరలవుతోంది.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అనంతరం ఆన్‌ఫీల్డ్ ప్రపోజల్‌తో తమ పెళ్లి వార్తను బహిర్గతం చేశారు మంధాన – పలాశ్. ప్రధాని నరేంద్ర మోడీ వీరి పెళ్లి నవంబర్ 23న జరుగనుందని హింట్ ఇచ్చేశారు. వివాహ క్రతువులో భాగంగా హల్దీ వేడుకలో మంధాన, భారత క్రికెటర్లు సందడి చేశారు. పసుపు రంగు డ్రెస్సులు ధరించి.. కాబోయే జంటకు అభినందనలు తెలిపారు. అనంతరం.. మెహందీ, సంగీత్లోనూ షఫాలీ వర్మ, రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక సంగీత్‌లో ‘సలాహ్ ఏ ఇష్క్’ (Salaam-E-Ishq) సినిమాలోని తేను లే కీ మైన్ జవాంగా పాటకు మంధాన – పలాశ్లు హుషారుగా డాన్స్ చేశారు. స్పెప్పులు వేయడానికి ముందు పలాశ్ మెడలో పూల దండ వేసిన మంధాన.. ఆ తర్వాత ఖతర్నాక్ డాన్స్‌తో ఆహుతులను ఆశ్చర్యపరిచింది. మరొక వీడియోలో బాలీవుడ్ సింగర్ అయిన పలాశ్ తన భాగస్వామి అందాన్ని పొగుడుతూ ‘గులాబీ అంకే’ (Gulabi Aankhen) అనే పాట ఆలపించాడు. భారత క్రికెటర్లు మంధానతో తమ స్నేహ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ‘తేరా యార్ హూ మైన్’ అనే పాటకు డాన్స్ చేసి ఆహుతులను ఫిదా చేశారు.
భారత ఓపెనర్‌గా అదరగొడుతున్న మంధానకు, కచేరీలు, సొంతంగా ఆల్బమ్స్ ద్వారా పాపులర్ అయిన పలాశ్ ముచ్చల్‌కు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి తరచూ పార్టీల్లో కలుస్తుండేవాళ్లు. అలా ఒకరిమీద ఒకరికి 2019 లోనే ప్రేమ పుట్టింది. అలాగని తమ రిలేషన్‌షిప్‌ను ఇద్దరూ రహస్యంగానే ఉంచారు. ఈ జంట 2013లో తొలిసారి దీపావళి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలోనే వీళ్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. అయినా సరే మంధాన, పలశ్లు ఓపెన్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అడపాదడపా ఇద్దరూ జంటగా కెమెరా కంట పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేయసికి పలాశ్ పియానో గురువుగా మారాడు. ఆ వీడియో అప్పట్లో కూడా బాగా వైరల్ అయింది.