Mixed Vegetable Salad | ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక మంది రోజూ పౌష్టికాహారాన్ని తింటుంటారు. అన్ని పోషకాలు కలిగి ఉండే ఆహారాలను రోజూ తింటారు. ఈ క్రమంలోనే కూరగాయలు ఇలాంటి ఆహారాల్లో ముందు వరుసలో నిలుస్తాయని చెప్పవచ్చు. కూరగాయలను తాజాగా రోజూ తింటే అనేక లాభాలు కలుగుతాయి. అందుకనే చాలా మంది వెజిటబుల్ సలాడ్ రూపంలో కూరగాయలను తింటారు. అయితే వెజిటబుల్ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలి, ఇందులో ఎలాంటి కూరగాయలను ఉపయోగించాలి.. అన్న విషయాలు చాలా మందికి తెలియవు. కానీ దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇందులో వాడే కూరగాయలు లేదా పదార్థాలు అన్నీ మనకు అందుబాటులో ఉండేవే. ఈ క్రమంలోనే ఇలా వెజిటబుల్ సలాడ్‌ను తయారు చేసి రోజూ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
వెజిటబుల్ సలాడ్ తయారీకి గాను 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్, 3 బేబీ కార్న్, 1 లేదా 2 టమాటాలు, 1 గ్రీన్ క్యాప్సికం, 1 పసుపు రంగు క్యాప్సికం, 2 క్యారెట్లు, 8 నుంచి 10 గ్రీన్ బీన్స్, 1 బ్రోకలీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వెజిటబుల్ సలాడ్‌ను ఎలా తయారు చేయాలంటే.. మొదట బ్రోకలీని వేడి నీటిలో కొంత సమయం ఉడకబెట్టాలి. ఇది బ్రోకలీని మృదువుగా చేస్తుంది. ఇప్పుడు మిగతా కూరగాయలన్నింటినీ కట్ చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ ను వేయాలి. ఆలివ్ ఆయిల్ లేకపోతే వెన్న లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. అనంతరం అందులో బేబీ కార్న్, అన్ని తరిగిన కూరగాయల ముక్కలను వేయాలి. తరువాత కొంచెం నీరు వేసి సలాడ్ ను తక్కువ మంట మీద ఉడికించాలి. మీరు ఈ సలాడ్‌ను 5 నిమిషాలు మాత్రమే ఉడికించాలి. నీరు చాలా తక్కువగా వేయాలి. నీరు ఆవిరి అయ్యే లోపు కూరగాయలు ఉడుకుతాయి. ఇలా సలాడ్ రెడీ అవుతుంది. అనంతరం అందులో రుచికి అనుగుణంగా ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసుకోవాలి. అవసరం అనుకుంటే కాస్త నిమ్మరసం చల్లుకోవచ్చు. దీంతో వెజిటబుల్ సలాడ్ రెడీ అవుతుంది. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తినేయాలి. ఈ వెజిటబుల్ సలాడ్‌ను రోజూ తయారు చేసి తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.
మిక్స్డ్ వెజిటెబుల్ సలాడ్‌లో వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. కనుక దీన్ని తినడం ద్వారా మనకు రోజూ అన్ని పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సలాడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆహారం తక్కువగా తింటారు. దీని వల్ల బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. అధిక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ ఈ సలాడ్‌ను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ సలాడ్‌ను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. బద్దకం పోతుంది. ఉదయం ఈ సలాడ్‌ను తింటే రోజంతా ఉత్సాహంగా పనిచేయవచ్చు.
వెజిటబుల్ సలాడ్ వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. శరీరంలోని నీరు అధికంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా వేడి శరీరం ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇలా ఈ సలాడ్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్‌లో రోజూ ఒకే కూరగాయలను వాడాలని ఏమీ లేదు. మీకు నచ్చిన కూరగాయలు లేదా ఆకుకూరలతోనూ దీన్ని తయారు చేసుకోవచ్చు. కానీ మరీ అధికంగా ఉడికించకూడదు. అలాగే ఉప్పును మరీ ఎక్కువగా వేయకూడదు. కూరగాయలను పచ్చిగా తింటే సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక కాస్త ఉడికించి తింటే మంచిది. దీని వల్ల అనేక పోషకాలను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.