కొల్లాపూర్ : వితంతువును శుభ కార్యక్రమాల్లో దూరంపెట్టడం సాంఘిక దురాచారామని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) అన్నారు. సాంఘిక దురాచారాన్ని ఇంకా కొనసాగించడం సరైనది కాదని హితవు పలికారు.
కొల్లాపూర్( Kollapur) మండలం మాచినేనిపల్లిలో ఆదివారం ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటికి భూమిపూజ చేసేందుకు మంత్రి వెళ్లారు. భర్తను కోల్పోయిన లక్ష్మిదేవమ్మ కుమారుడు రాముడి పేరుతో ఇందిరమ్మ ఇల్లు ( Indiramma House ) మంజూరు చేయించారు. అయితే కోడలు గర్భిణీ కావడంతో పూజ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
లక్ష్మిదేవమ్మతో భూమిపూజ చేయాలని మంత్రి కోరగా స్థానికులు ఆమె వితంతువని, భూమి పూజ చేయరాదని మంత్రికి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వితంతువులను శుభ కార్యక్రమాల్లో దూరం పెట్టడం సాంఘిక దురాచారమని అన్నారు. భర్తను కోల్పోయి మానసిక వేదనకు గురవుతున్న స్త్రీలను శుభకార్యాలకు దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు బహిష్కరించడం అమానవీయమని పేర్కొన్నారు. దురాచారాలే స్త్రీల ఆర్ధిక, మానసిక పెరుగుదలకు అడ్డంకిగా మారాయని, పురోగమిస్తున్న సమాజంలో ఇలాంటి వివక్ష సరికాదని అన్నారు.
వివక్ష, సాంఘిక దురాచారాలు, మూడ నమ్మకాల వంటివి దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం బేస్మెంట్ నిర్మాణానికి ముందుగా సొంతంగా నిధులు సమకూర్చుకునే స్థోమత లేకపోవడంతో, మహిళా సంఘాల ద్వారా రూ.లక్షా రుణం మంజూరు చేయాలని సెర్ప్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు ఇమ్మిడిశెట్టి వెంకట స్వామి, నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.