Country Chicken Vs Broiler Chicken | ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు వేటిని తిందామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు వంటి వాటిని ఇంటికి తెచ్చుకుని తింటారు. లేదా బయట హోటల్స్ లో లాగించేస్తారు. అయితే అధిక శాతం మంది మాత్రం చికెన్‌ను తింటుంటారు. చికెన్‌తోనే అనేక వెరైటీలను చేసి తింటుంటారు. అయితే చికెన్ తినేవారు చాలా మంది నాటుకోడికి ప్రాధాన్యతను ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సహజసిద్ధంగా పెరిగిన నాటు కోళ్లు లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లో ఫామ్‌లలో పెరిగిన నాటు కోళ్లను విక్రయిస్తారు. అయితే వాస్తవానికి నాటుకోళ్లను తినాలా, బ్రాయిలర్ కోళ్లను తినాలా..? వీటిల్లో దేంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, ఏవి మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు సమాధానాలు చెబుతున్నారు.
నాటు కోళ్లు సహజసిద్ధంగా పెరిగేవి అయితే తమ ఆహారాన్ని తామే వెతుక్కుంటాయి. ఇవి చిన్న చిన్న పురుగులు, విత్తనాలు, ధాన్యాలు, గడ్డి వంటి వాటిని తిని పెరుగుతాయి. అదే బ్రాయిలర్ కోళ్లు అయితే ఫాం యజమానులు వీటిని త్వరగా విక్రయించాలి కనుక ఇవి వేగంగా పెరిగేందుకు గాను ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇక నాటు కోళ్లు పూర్తి స్థాయిలో పెరిగేందుకు కనీసం 4 నుంచి 6 నెలల సమయం పడుతుంది. కానీ బ్రాయిలర్ కోళ్లు 5 నుంచి 9 వారాల్లో పెరుగుతాయి. నాటు కోళ్లు సహజసిద్ధంగా పెరుగుతాయి కనుక వీటి మాంసం అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే నాటు కోళ్ల మాంసం రుచిగా కూడా ఉంటుంది. బ్రాయిలర్ కోళ్ల మాంసంలో పోషకాల శాతం గణనీయంగా తగ్గుతుంది. కొవ్వు పెరుగుతుంది. పైగా ఈ మాంసం పెద్దగా రుచిగా కూడా ఉండదు. నాటు కోళ్లలో కండరాలు అధికంగా కొవ్వు తక్కువగా ఉంటే, బ్రాయిలర్ కోళ్లలో కండరాలు తక్కువగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
నాటు కోళ్ల మాంసం ధర ఎక్కువగా ఉంటుంది. బ్రాయిలర్ కోళ్లు తక్కువ ధరకే లభిస్తాయి. నాటు కోళ్లు పెరిగేందుకు సాధారణంగా యాంటీ బయోటిక్స్, మందులను ఉపయోగించరు. కానీ బ్రాయిలర్ కోళ్లు పెరిగేందుకు మాత్రం కచ్చితంగా మందులను ఇస్తారు. వాటి వల్లే అవి త్వరగా పెరుగుతాయి. కనుక ఎలా చూసినా కూడా నాటు కోళ్లే మనకు ఎక్కువ పోషకాలను, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పవచ్చు. కనుక బ్రాయిలర్ కోళ్ల కన్నా కూడా నాటు కోళ్లను తినడమే శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నాటుకోళ్లలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సహాయం చేస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. దీని వల్ల సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే నాటుకోడి మాంసంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
నాటుకోడి మాంసంలో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి12 మనకు అధికంగా లభిస్తుంది. ఇది నాడీ మండల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నాడీ సంబంధ సమస్యలు, మెడ, భుజాల నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరిగేలా చేస్తుంది. మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. చాలా మందికి విటమిన్ బి12 లోపం ఉంటుంది. అలాంటి వారు నాటు కోడి మాంసాన్ని తింటుంటే ఎంతగానో ఉపయోగం ఉంటుంది. నాటు కోళ్లలో కొవ్వు శాతం చాలా తక్కువగా, కండరాల శాతం అధికంగా ఉంటుంది. కనుక హై క్వాలిటీ ప్రోటీన్లను పొందవచ్చు. దీని వల్ల మన కండరాలకు శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసేవారికి నాటు కోడి మాంసం ఎంతో మేలు చేస్తుంది. ఈ మాంసంలో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక ఈ మాంసాన్ని తింటే శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా నాటు కోడి మాంసంతో లాభాలను పొందవచ్చు.