నార్నూర్, డిసెంబర్ 6 : సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోకండే చంద్రశేఖర్ కొనియాడారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, మేడిగూడ, తాడిహత్నూర్, బొప్పాపూర్, ములంగి, కొత్తపల్లి, గుండాల ఎస్సీగూడ, మారేగావ్, బుద్ధ గూడ తో పాటు దళిత వాడాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళలు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సమాజంలో నిమ్నజాతి వర్గాలకు రాజ్య అధికారాన్ని చేరువచేసే దిశగా వైపు అంబేద్కర్ రచన చేసినట్లు వివరించారు. ఆ మహనీయుడు కృషివల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. నేటితరం యువత అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ జెడ్పిటిసి హేమలత బ్రిజ్జిలాల్, గాదిగూడ మాజీ వైస్ ఎంపీపీ మార్సివనే యోగేష్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జిల్లా మాజీ సభ్యుడు అనిల్, మాజీ సర్పంచ్ కొడప శోభ ఆనంద్ రావ్, ఉత్తమ్, జంగు, విజయ్, కేశవ్, రుక్మాబాయి, మీనా తదితరులున్నారు.