సంగారెడ్డి సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 72 జడ్పీటీసీ, 681 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 1613 సర్పంచ్, 14098 పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరపనున్నారు. అక్టోబర్ 9 నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ , అక్టోబర్ 17 నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధవుతున్నారు. ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ పద్ధ్దతిలో నిర్వహించే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
స్థానిక పోరులో తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీ, 261 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సిద్దిపేటలో 26 జడ్పీటీసీ, 230 ఎంపీటీసీ స్థానాలు, మెదక్ జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మది మెదక్ జిల్లాలో మొత్తం 72 జడ్పీటీసీ, 681 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికలు నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అక్టోబర్ 9 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 12న నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 15న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
అక్టోబర్ 23న ఓటింగ్, నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రెండో విడత ఎన్నికలు నిర్వహించే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 16న నామినేషన్లు పరిశీలన, అక్టోబర్ 19న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 27న రెండవ విడత ఎన్నికలు నిర్వహించి, నవంబర్ 11న ఓట్లు లెక్కిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏయే మండలాల్లో రెండు దశలుగా ఎన్నికలు నిర్వహించాలనేది త్వరలో నిర్ణయిస్తారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జహీరాబాద్, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్లోని 13 జడ్పీటీసీ, 141 ఎంపీటీసీ స్థానాలకు తొలి విడత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధ్దం చేశారు. సంగారెడ్డి, అందోల్ రెవెన్యూ డివిజన్లలోని 120 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలకు రెండ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా లోని 1613 సర్పంచ్ లు, 14098 వార్డు స్థానాలకు మూడు విడత లుగా ఎన్నికలు నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో 613 సర్పంచ్, 1458 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 508 సర్పంచ్, 1291 వార్డు స్థానాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 492 సర్పంచ్, 1052 వార్డు స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు సంబంధించి అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు నామి నేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 20న నామినేషన్లు పరిశీలిస్తారు. అక్టోబర్ 23న నామి నేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 31న తొలి విడతగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహి స్తారు. మలి విడత ఎన్నికలు జరిగే పంచా యతీల్లో అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
అక్టోబర్ 24 నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 4న రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో విడతగా ఎన్నికలు నిర్వహించే పంచాయతీలకు సంబంధించి అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 28 నామినేషన్ల పరిశీలన, 31న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 8న మూడవ విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ అధికారులు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిం చేందుకు కసరత్తు పూర్తి చేసి వివరాలను ఎన్ని కల సంఘంకు అందజేశారు.
నారాయణఖేడ్, జహీరాబాద్ రెవెన్యూ డివిజన్లలోని కల్హేర్, కంగ్టి, మనూరు, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లోని పంచాయతీల్లో మొదట విడత, అందోల్ డివిజన్లోని అందోల్, చౌటకూరు, పుల్కల్, వట్పల్లి, జహీరాబాద్ డివిజన్లోని రాయికోడ్ మండలాల్లోని పంచాయతీల్లో రెండవ విడత, సంగారెడ్డి డివిజన్లోని గుమ్మడిదల, హత్నూర, కంది, కొండాపూర్, మునిపల్లి, పటాన్చెరు, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో పంచాయతీల్లో మూడ విడత పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
స్థానిక పోరుకు షెడ్యూల్ విడుదల కావటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. ఎన్నికల సంఘం దసరాకు ముందే షెడ్యూల్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు ఇది వరకే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రిజర్వేషన్లకు అనుగుణంగా బరిలో దిగేందుకు రాజకీయపార్టీల్లోని నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సిద్ధవుతున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొంత కాలంగా గ్రామాల్లోని నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
షెడ్యూల్ వెలువడటంతో ఆశావహుల దృష్టి ఎన్నికల టికెట్లపై పడింది. ఓవైపు ఓటర్లను కలిసి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు పార్టీ టికెట్లు, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌గా బరిలో దిగాలనుకుంటున్న అభ్యర్థులు తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలను ప్రసన్నం చేసుకుని టికెట్ సాధించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధవుతున్నాయి. తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనుండడంతో అన్ని రాజకీయపార్టీలు రిజర్వేషన్లకు అనుగుణంగా తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నాయి.