Liver Cancer | ప్రపంచ వ్యాప్తంగా ఏటా అధిక శాతం మందిని కబలిస్తున్న ప్రధాన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది శరీరంలో అనేక భాగాలకు వస్తుంది. అలాగే లివర్కూ వ్యాప్తి చెందుతుంది. లివర్ క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారిలో లివర్ కణాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో పలు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గమనిస్తే లివర్ క్యాన్సర్ ఉన్నట్లు ముందుగానే గుర్తించవచ్చు. దీంతో చికిత్స తీసుకుని లివర్ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. దీని వల్ల ప్రాణాంతకం కాకుండా సురక్షితంగా ఉండవచ్చు. లివర్ క్యాన్సర్ ఉన్నవారిలో శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది.
లివర్ క్యాన్సర్ ప్రారంభంలో ఉన్నా కొందరిలో పలు లక్షణాల కనిపిస్తాయి. ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్లుండి సడెన్‌గా బరువు తగ్గిపోతుంటారు. ఆకలి ఉండదు. కాస్త తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారం సహించదు. కడుపులో నొప్పిగా ఉంటుంది. వికారంగా ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. పచ్చ కామెర్లు వస్తాయి. అవి ఎన్ని రోజులు ఉన్నా కూడా తగ్గవు. పొట్ట మొత్తం ఉబ్బిపోయి కనిపిస్తుంది. చిన్న పనిచేసినా తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. మూత్రం ముదురు రంగులో వస్తుంది. చిన్నపాటి దెబ్బ తగిలినా సులభంగా రక్తస్రావం అవుతుంది. చర్మం బాగా కందిపోయినట్లు అవుతుంది. ఇవన్నీ లివర్ క్యాన్సర్ వచ్చిందని తెలిపే లక్షణాలు.
లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. లివర్ సిర్రోసిస్ అనే సమస్య దీర్ఘకాలంగా ఉన్నవారికి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు ఉన్నా, మద్యం విపరీతంగా సేవిస్తున్నా, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే సమస్య ఉన్నవారిలో, టైప్ 2 డయాబెటిస్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్ అనే సమస్య ఉన్నవారిలో, ఫంగస్ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలంగా ఉంటే, స్థూలకాయం ఉన్నవారిలో, పొగ తాగేవారికి లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే లివర్ క్యాన్సర్ అనేది జన్యు సంబంధ సమస్యలు లేదా వంశ పారంపర్య కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయితే కచ్చితంగా చికిత్స తీసుకోవాలి. వ్యాధి ప్రారంభ దశలో ఉంటే లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స తీసుకుని ప్రాణాంతకం కాకుండా సురక్షితంగా ఉండవచ్చు. అయితే లివర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారు లేదా వ్యాధి రావొద్దని కోరుకునే వారు, లివర్ సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిది. దీంతో వ్యాధి మరింత ముదరకుండా ఉంటుంది. వ్యాధి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. కాఫీని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే లివర్‌కు ఎంతో మేలు చేస్తుంది. లివర్ కణాలు డ్యామేజ్ అవకుండా కాఫీ రక్షిస్తుంది. కాఫీలో ఉండే సమ్మేళనాలు లివర్‌ను రక్షిస్తాయి. లివర్‌లో కొవ్వు చేరకుండా చూస్తాయి. లివర్ వాపులను తగ్గిస్తాయి. ఓట్మీల్ ను తీసుకోవడం వల్ల ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది లివర్‌లోని కొవ్వును కరిగించి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గ్రీన్ టీని కూడా రోజూ తాగవచ్చు. వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటున్నా మేలు జరుగుతుంది. బెర్రీలు, ద్రాక్ష, చేపలు, ఆకుకూరలు, బీట్ రూట్, పప్పు దినుసులు, తృణ ధాన్యాలను రోజూ తింటుంటే లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. లివర్ క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది.