Lungs Failure | మనం పీల్చే గాలిని శుద్ధి చేసి శరీర భాగాలకు అందించడంతోపాటు శరీర భాగాల్లో ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ వంటి చెడు వాయువులను బయటకు పంపించడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఊపిరితిత్తులు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను సైతం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. అయితే పలు రకాల కారణాల వల్ల కొందరికి ఊపిరితిత్తులు చెడిపోవడం జరుగుతుంది. కిడ్నీలు ఫెయిల్ అయినట్లుగానే ఊపిరితిత్తులు కూడా కొందరికి ఫెయిల్ అవుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. శ్వాసనాళంలో ఏవైనా తీవ్రమైన అడ్డంకులు ఉంటే దీర్ఘకాలంలో అది ఊపిరితిత్తుల ఫెయిల్యూర్‌కు దారి తీస్తుంది. అలాగే ఆస్తమా ఉన్నవారికి కూడా ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అనే సమస్య ఉన్నవారికి, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే వ్యాధి ఉన్నా ఊపిరితిత్తులు ఫెయిల్ అవుతాయి. ఊపిరితిత్తుల కణజాలంలో సమస్యలు ఉన్నా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) అనే సమస్య ఉన్నవారిలో, న్యుమోనియా దీర్ఘకాలంగా ఉన్నా, పల్మనరీ ఫైబ్రోసిస్ అనే సమస్య ఉన్నవారికి కూడా లంగ్స్ ఫెయిల్ అవుతాయి. ఊపిరితిత్తుల్లో ఉండే రక్త నాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగకపోయినా, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ సరిగ్గా సరఫరా అవకపోయినా, పల్మనరీ ఎంబోలిజం అనే సమస్య ఉన్నవారిలో, గుండె జబ్బులు ఉన్నవారిలోనూ ఊపిరితిత్తులు చెడిపోయే అవకాశాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఊపిరితిత్తులు ఫెయిల్ అయిన వారిలో పలు లక్షణాలు కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడం నిరంతరాయంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కొందరు వేగంగా శ్వాస తీసుకుంటారు.
ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, అవి చెడిపోయినా కూడా కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. చర్మం, పెదవులు నీలి రంగులో మారి దర్శనమిస్తాయి. ఆందోళన, తలతిరగడం, విశ్రాంతి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఊపిరితిత్తులు చెడిపోయాయి అని చెప్పేందుకు లక్షణాలుగా భావించవచ్చు. అయితే కొందరికి ఈ సమస్య ఉంటే తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. నిద్రమత్తుతో ఉంటారు. ఇక ఊపిరితిత్తులు చెడిపోయిన వారు డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. దీని వల్ల ఊపిరితిత్తులను తిరిగి ఆరోగ్యంగా పనిచేసేలా చేయవచ్చు.
ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఇవి వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల కణజాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. బెర్రీలు, యాపిల్స్, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, టమాటాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపలు, గింజలు, విత్తనాలు, మెగ్నిషియం అధికంగా ఉండే పాలకూర, అరటి పండ్లు, అవకాడో, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లు, కోడిగుడ్డు పచ్చని సొన, తృణ ధాన్యాలు, కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీలు లాంటి ఆహారాలన్నీ ఊపిరితిత్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు ఈ ఆహారాలను తింటుంటే మేలు జరుగుతుంది.