రామగిరి, నవంబర్ 04 : తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 9న నల్లగొండ జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్ లో జరిగే సాహిత్య సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ సాహితీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్ కోరారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, తెలుగు శాఖ అధ్యక్షుడు, సహాయ ఆచార్యులు డాక్టర్ వెల్దండి శ్రీధర్తో కలిసి ఆయన సాహిత్య సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాహిత్య సమ్మేళనంలో కవి సమ్మేళనం కవితలు, పాటల పోటీలు నిర్వహించబడతాయన్నారు. మధ్యాహ్నం సెషన్లో సాహిత్య సదస్సు జరుగుతుందని, విద్యా- సమాజం అనే అంశంపై ప్రముఖ మట్టికవి డాక్టర్ బెల్లి యాదయ్య ప్రధాన వక్తగా ప్రసంగిస్తారన్నారు. ప్రజల మనిషి పుస్తక పరిచయంపై ప్రముఖ కవి, విమర్శకుడు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య ప్రసంగించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లా స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, కవితలు, పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కవి సమ్మేళనం, పాటల పోటీల్లో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే అన్నారు. నల్లగొండ జిల్లా స్థాయిలో హైస్కూల్ స్థాయి విద్యార్థులకు నిర్వహించిన పద్య, పఠన, కవితా పఠన, పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయబడతాయన్నారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుకోజ్వల ఆనందాచారి, తెలంగాణ సాహితీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సలీమా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, అంబటి వెంకన్న, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ నర్రా ప్రవీణ్ రెడ్డి, భూతం ముత్యాలు, డాక్టర్ ఉప్పల పద్మ, మాదగాని శంకరయ్య పాల్గొంటున్నట్లు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యాపకులు శిబిచక్రవర్తి, వెంకటరమణ, కిరణ్, డాక్టర్ వెంకటేశ్, భాస్కర్, చాట్ల నవీన్, తెలంగాణ సాహితీ జిల్లా ఉపాధ్యక్షుడు బూరుగు గోపికృష్ణ పాల్గొన్నారు.