Life of girl – LOG | మనసు విప్పి మాట్లాడే స్నేహితురాలు, నెగెటివ్ ఆలోచనలను పారదోలే మార్గదర్శి, వృత్తి ఉద్యోగాల్లో భాగంగా.. హైదరాబాద్‌లోని ఏ మూలకు వెళ్తున్నా నేనున్నానంటూ తోడు నిలిచే తోబుట్టువు ..ఒక్క మాటలో చెప్పాలంటే ‘ లైఫ్ ఆఫ్ గర్ల్ ( Life of girl ) ‘ మొబైల్ అప్లికేషన్ సర్వసైన్యమై మహిళ వెనుక నిలబడుతుంది. మనోబలాన్నీ, ఆత్మ స్థయిర్యాన్నీ అందిస్తుంది.
బయటకు వెళ్లిన ఆడపిల్ల ఇంటికి వచ్చేదాకా అమ్మకు భయం! కూతురు కాలేజీ నుంచో ఆఫీసు నుంచో వచ్చే సమయం దాటిందా.. నాన్న గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి! ఫోన్ చేస్తే ఒకసారి కలవదు. ఇంకోసారి ఎంగేజ్ వస్తుంది. కాసేపటికి స్విచ్చాఫ్ అవుతుంది. ఘడియకోసారి గడప వంకే చూస్తూ బెంబేలెత్తిపోతుంది అమ్మ. కంగారంతా కడుపులోనే దాచుకొని వీధి మలుపు దాకా వెళ్లొస్తుంటాడు నాన్న! ప్రభుత్వం ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా, రక్షకభటులు ఎంతలా పెట్రోలింగ్ చేస్తున్నా.. అతివల రక్షణకు చాలడం లేదు. విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ప్రమాదాల బారిన పడుతున్న పడతుల కథనాలు పతాక శీర్షికలు అవుతున్నాయి. ఈ దారుణాలకు ముగింపు పలికే లక్ష్యంతో వచ్చిందే.. ‘ లైఫ్ ఆఫ్ గర్ల్ ( Life of girl )’ మొబైల్ అప్లికేషన్. ఒక్క మీట నొక్కితే చాలు. ముంచుకొచ్చిన ముప్పు తప్పిపోతుంది. స్టార్టప్ ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న టీ-హబ్‌లో తయారైన ‘ఎల్ఓజీ ( LOG)’ అప్లికేషన్ సంగతులివి.
ఆడపిల్లలకు అండగా ఓ యువ బృందం రూపొందించిన వినూత్నమైన యాప్ ఇది. అత్యవసర పరిస్థితుల్లో, అదీ నిమిషాల వ్యవధిలోనే రక్షణ కల్పించేందుకు ‘ లైఫ్ ఆఫ్ గర్ల్ ‘ పేరుతో అప్లికేషన్‌ను ఆవిష్కరించారు. బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను మరిన్ని ఫీచర్స్‌తో అప్‌గ్రేడ్ చేశారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో యాప్ లోగోను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సికిందర్ ఖాన్, మేనేజర్ వికిల్, హెచ్ఆర్ జస్వీ, ఆండ్రాయిడ్ డెవలపర్స్ సుమలత బారెడ్డి, కార్తిక్, లావణ్యతో కలిసి ఆవిష్కరించారు. ఈ యాప్‌లో మూడు పదునైన ఆప్షన్లు ఉంటాయి. అవే త్రినేత్రాల్లా పనిచేస్తాయి.
నిన్నటికి నిన్న ‘ మిస్ తెలంగాణ ’ కిరీటం దక్కించుకున్న ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఫోన్లో లైవ్ పెట్టి, చున్నీతో ఉరిపోసుకోవడానికి ప్రయత్నించింది. సమయానికి స్నేహితులు స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. మానసిక కుంగుబాటుతో సతమతమయ్యేవాళ్లు క్షణికావేశంలో ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు కోకొల్లలు. డిప్రెషన్లో ఉన్నవాళ్లను, ఆ ఊబి నుంచి బయటపడేసేలా ‘ ఎల్ఓజీ ( LOG ) ’ యాప్‌లో ‘సైకాలజీ సేఫ్టీ’ ఆప్షన్ పొందుపరిచారు. మానసిక సంఘర్షణకు గురువుతున్నవాళ్లు యాప్‌లో తమ వివరాలను వెల్లడిస్తే తక్షణ స్పందన లభిస్తుంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్నా.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నవారు ఈ యాప్ ద్వారా సైకాలజిస్టులను సంప్రదించవచ్చు. చాట్ రూపంలో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.
‘ ఎల్ఓజీ ’ యాప్‌లో మరో ఆప్షన్ ‘ ట్రావెలింగ్ సేఫ్టీ ’. దీని ద్వారా మహిళలు, యువతులు తాము వెళ్లబోతున్న ప్రాంతం సురక్షితమైనదా, కాదా అన్నది తెలుసుకోవచ్చు. శాంతిభద్రతలు, మహిళల రక్షణకు సంబంధించి ఆ ప్రాంత చరిత్రను బేరీజు వేసి కచ్చితమైన ‘సేఫ్టీ స్కోర్’ అందిస్తుంది. ఈ వివరాలను బట్టి సదరు ప్రాంతం ఎంత సురక్షితమైనదనే విషయంలో అంచనాకు రావొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయినా కూడా ఏదైనా ఇబ్బంది ఎదురైతే, కంగారు పడాల్సిన పనిలేదు. యాప్‌లో రెడ్, ఆరెంజ్, ఎల్లో బటన్స్ అందుబాటులో ఉంటాయి. ఆ పరిసరాల్లో ప్రాణ రక్షణకో, మాన రక్షణకో విఘాతం కలుగబోతున్నట్టు అనుమానం కలిగిన వెంటనే రెడ్ బటన్ నొక్కితే చాలు. వెంటనే పోలీసులతోపాటు వలంటీర్లకు నోటిఫికేషన్ వెళ్తుంది. నిమిషాల వ్యవధిలో బాధితులు ఉన్న చోటుకు చేరుకొంటారు. నగరంలోని మూడువేల మంది వలంటీర్ల బృందం కర్తవ్య నిర్వహణకు సదా సిద్ధంగా ఉంటుంది.
ఈ యాప్‌లోని మరో ప్రత్యేకత.. ‘ఎమర్జెన్సీ సేఫ్టీ ఆప్షన్’. సెన్సర్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. తమ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొన్న మహిళలు.. ఆత్మరక్షణ కోసం గాబరాగా పరుగులు పెడుతుంటే సెన్సర్లు స్పందిస్తాయి. వలంటీర్లకు సందేశం చేరిపోతుంది. గూగుల్ మ్యాప్ సాయంతో స్వచ్ఛంద సేవకులు బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సాధ్యమైనంత త్వరగా చేరుకొంటారు. రానున్న ప్రమాదాన్ని నివారిస్తారు. ‘లైఫ్ ఆఫ్ గర్ల్’ యాప్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది. భౌతికంగా, మానసికంగా, డిజిటల్‌గా.. సురక్షిత సమాజాన్ని నిర్మించాలన్నదే యాప్ నిర్వాహకుల లక్ష్యం.
లైఫ్ ఆఫ్ గర్ల్ యాప్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో LifeOfGirl-LOG అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోని స్పామ్ లింక్ ద్వారా ‘డిజిటల్ సేఫ్టీ’ కూడా పొందవచ్చు.
… పి.అరుణ్ కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ స్క్విడ్ గేమ్ యాప్‌ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి.. లేదంటే మీ ఫోన్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే
She team | ఆ వయసు వాళ్లే అమ్మాయిలను ఎక్కువగా వేధిస్తున్నారంట
అమ్మ తోడు.. ఇంకోసారి అలా చేయను.. అమ్మాయిని వేధించి షీటీమ్స్ ముందు ప్రాధేయపడ్డ పోకిరీ
she teams | పదేపదే వేధిస్తే.. రౌడీషీట్