హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పర్యాటక రంగానికి సరికొత్త రూపు కల్పించేలా అథికారులు ప్రణాళికలు తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటకరంగ మౌలిక వసతుల కల్పనపై శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పర్యాటక అవకాశాలు మెండుగా ఉన్న కీలక ప్రాంతాలను గుర్తించి, నాణ్యమైన హోటళ్లు, ఆధునిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) ఆధ్వర్యంలోని ప్రాపర్టీలను ఆధునీకరించడంతోపాటు, నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూములు, సెమీ-ఫారెస్ట్ స్థలాల్లో పర్యాటక సంబంధిత వసతుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా నిలబెట్టేందుకు విసృ్తత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకోసం ప్రత్యేక ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను రూపొందించడంతోపాటు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని పేరొన్నారు.