న్యూయార్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సీడెడ్ ప్లేయర్లకు షాక్ తగిలింది. కరోలినా ముచోవా, ఎలినా స్వితోలినా, లోకల్ స్టార్ మాడిసన్ కీస్ మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. 22వ సీడ్ కీస్‌కు క్వాలిఫయర్ క్విన్వెన్ జెంగ్ షాకిచ్చింది. శనివారం జరిగిన మూడో రౌండ్లో చైనా స్టార్ జెంగ్ 1-6, 7-6(7/3), 7-5తో మాడిసన్‌ను ఓడించింది. తొలి సెట్ కోల్పోయి రెండో సెట్లో 0-5తో పరాజయం అంచుల్లో నిలిచిన దశలో అసాధారణంగా పుంజుకున్న జెంగ్ ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచే విజయంతో ప్రిక్వార్టర్స్ చేరింది.
ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ముచోవా (చెక్) 3-6, 5-7తో 26వ సీడ్ నవరో (అమెరికా) చేతిలో ఓడగా, తొమ్మిదో సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ స్వితోలినా 3-6, 6-2, 3-6తో 21వ సీడ్ కలిన్స్కయా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. ఆరో సీడ్ నొస్కోవా (చెక్) 6-2, 6-7 (6/8), 6-2తో లోకల్ ప్లేయర్ అన్ లీని ఓడించి ప్రిక్వార్టర్స్ చేరింది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ యంగ్‌స్టర్ కార్లోస్ అల్కరాస్ ప్రిక్వార్టర్స్ చేరుకున్నాడు.
మూడో రౌండ్లో అతను 6-3, 6-4, 6-1తో వరుస సెట్లలో చైనా ప్లేయర్ వు యిబింగ్ను చిత్తు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 6-4, 6-4, 6-4తో రిండర్క్నెచ్పై, స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 2-6, 6-1, 7-6 (7/3), 6-1తో 18వ సీడ్ జిరి లెహెకాపై విజయం సాధించారు. అమెరికా ప్లేయర్లు బ్రెండన్ షెల్టన్, ఫ్రాన్సిస్ తియఫో కూడా ముందంజ వేశారు. ఇక, రెండేండ్ల తర్వాత మళ్లీ గ్రాండ్‌స్లామ్ కోర్టులో జతకట్టిన అమెరికా స్టార్ సిస్టర్స్ సెరెనా విలియమ్స్, వీనస్ తొలి రౌండ్లోనే ఓడారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు యూకీ భాంబ్రీ, నిక్కీ పునాచ తమ సహచరులతో తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు.