మాజీ కెప్టెన్‌కు రోహిత్ మద్దతు
కోల్‌కతా: టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతుగా నిలిచాడు. పదే పదే అతడి ఫామ్ గురించి మాట్లాడి అనవసరమైన అనుమానాలు లేవనెత్తడం తగదని హిట్‌మ్యాన్ సూచించాడు. వెస్టిండీస్ తొలి టీ20కి ముందు మంగళవారం రోహిత్ మాట్లాడుతూ.. ‘కోహ్లీ ఫామ్ గురించి చింత లేదు. అనవసర వార్తల వల్లే అతడి ఫామ్‌పై లేనిపోని చర్చలు జరుగుతున్నాయి. దీన్ని మీరే (మీడియా) ప్రారంభించారు. కొన్నాళ్లు మౌనంగా ఉండి అతడిని వదిలేస్తే.. అంతా సర్దుకుంటుంది. కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి అపార అనుభవం ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా అధిగమించాలో విరాట్‌కు బాగా తెలుసు’అని అన్నాడు. విరాట్‌లో ఆత్మవిశ్వాసం లోపించిందా అనే ప్రశ్నకు రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ‘విరాట్ కోహ్లీ కో కాన్ఫిడెన్స్‌కి జరూరత్ హై? క్యా బాత్ కర్ రహే హో యార్'(విరాట్ ఆత్మవిశ్వాసం కోల్పోయాడా? ఏం మాట్లాడుతున్నావ్)
అని అన్నాడు.
దేశం తర్వాతే.. ఫ్రాంచైజీ
తాజా ఐపీఎల్ వేలంలో కోట్లకు కోట్లు కొల్లగొట్టిన కుర్రాళ్లకు రోహిత్ కీలక సూచనలు చేశాడు. వేలంలో ఎదురైన అనుభవాలను పక్కనపెట్టి రాబోయే రెండు వారాలు దేశం కోసం శ్రమించాలని పేర్కొన్నాడు. మెగా వేలంలో కొందరు రికార్డు ధరకు అమ్ముడుపోగా.. మరికొందరికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘వేలం వార్తలతో ఆటగాళ్లు భావోద్వేగానికి గురవుతారు. అయితే వాటిని పక్కనపెట్టి జాతీయ జట్టుకు ఆడటంపై దృష్టి పెట్టడం ముఖ్యం. అయిందేదో అయిపోయింది. రాబోయే రెండు వారాలు టీమ్ఇండియా కోసం శ్రమించాలి. ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్లు సిద్ధం కావు. ప్రతి ఒక్క ఆటగాడికి నిర్దిష్టమైన బాధ్యతలు ఉంటాయి’అని అన్నాడు. ప్రయోగాలు అనే పదాన్ని వినియోగించడానికి ఇష్టపడని రోహిత్.. కుర్రాళ్లు సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారికి తగినన్ని అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు. కుల్చా జోడీపై ప్రశంసలు కురిపించిన హిట్‌మ్యాన్.. హార్దిక్ పునరాగమనానికి తలుపులు తెరిచే ఉన్నాయని పేర్కొన్నాడు.