మహబూబాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : యూరియా అడిగిన పాపానికి రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసిన ఘటన మానుకోట జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగింది. నర్సింహులపేట పీఏసీఎస్ కేంద్రాల్లోనే ఇప్పటివరకు యూరియా పంపిణీ చేయగా బుధవారం భారతి ట్రేడర్స్, ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాపునకు 430 బస్తాలు యూరియా వచ్చింది. రైతులు తండోపతండాలుగా తరలివచ్చి ఉదయం నుంచి షాపు ముందు క్యూలో నిల్చున్నారు. గంటలకొద్దీ నిల్చున్నా లైన్ కదలకపోవడంతో ఓపిక నశించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన షాపు యజమానులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు చేరుకొని రైతులపై లాఠీచార్జి చేశారన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అకడ ఉన్న కొంతమంది రైతులతో లాఠీచార్జి జరగలేదన్నట్టుగా వీడియోలు తీయించారు. పోలీసులు ఎవరిపైనా లాఠీచార్జి చేయలేదని తొర్రూరు డీఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. యూరియా బస్తా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రైతులపై జరిగిన లాఠీచార్జి రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వానికి పెద్ద తలవొప్పిగా మారింది. ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో జరిగిన ఈ ఘటనను బుధవారం ఎక్స్ వేదికగా ఖండించారు.
లాఠీచార్జి అవాస్తవం: తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్
నర్సింహుల పేట భారతి ఫెర్టిలైజర్ షాపు వద్ద పోలీసులు రైతులపై లాఠీచార్జి చేశారనేది అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు రైతుల కోసమే పని చేస్తున్నాం. బుధవారం నరసింహుల పేట ఫర్టిలైజర్ షాపులోకి ఒకేసారి 50 మంది రైతులు చొచ్చుకొని వెళ్లారు. వారిని బయటకు పంపిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు షట్టర్లను కిందికి దించారు. రైతులపై లాఠీచార్జి చేయలేదు. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తాం.