సికింద్రాబాద్, ఏప్రిల్21: సికింద్రాబాద్ హమాలీ బస్తీలో పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు కేటాయించాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టిని కలిసి వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో డిగ్నిటీ హౌసింగ్ స్కీమ్ నిర్మించి ఇచ్చిన వాటిలో 65 ఇండ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిలిపివేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
గతంలో ఈ 65 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, సభ్యులను సంప్రదించగా సోమవారం లష్కర్ జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి సాధం బాలరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను కలిసి 65 ఇండ్ల లబ్దిదారుల పత్రాలను పరిశీలించి అందులో మిగిలిన పనులను పూర్తిచేసి లబ్దిదారులకు అందచేయాల్సిందిగా కోరుతూ వినతి పత్రం అందించారు. ఆ వినతికి కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఆర్డీవో సాయిరాం ఇతర అధికారులతో మాట్లాడి 15 రోజుల్లోగా లబ్ధిదారులను అందజేస్తామని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.