Adani Group | అహ్మదాబాద్, జూలై 5: గుజరాత్‌లోని ముంద్రాపోర్టు సమీపంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీకి కట్టబెట్టిన 108 హెక్టార్ల పచ్చిక భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవీనల్ గ్రామస్థుల అలుపెరుగని పోరుతో రాష్ట్ర బీజేపీ సర్కారు వెనక్కి తగ్గింది. నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005లో అదానీ పోర్ట్స్, సెజ్ లిమిటెడ్‌కు ప్రభుత్వం 231 ఎకరాల భూమిని కేటాయించింది.
2010లో ఆ స్థలంలో ఏపీసెజ్ ఫెన్సింగ్ వేయడం ప్రారంభించడంతో ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదానీకి భూమి కేటాయించిన తర్వాత కేవలం 45 ఎకరాల పచ్చిక భూమి మాత్రమే మిగిలిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే పచ్చిక భూమి కొరత ఉండగా, ప్రభుత్వం ఆ భూమిని కేటాయించడం చట్టవిరుద్ధమని, పైగా ఆ భూమి కమ్యూనిటీ వనరు అని వివరించారు.
ఈ క్రమంలో పశువుల మేత కోసం అదనంగా 387 హెక్టార్లు కేటాస్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో 2014లో కేసును కొట్టివేశారు. అనంతరం ప్రభుత్వం మాట నిలుపుకోకపోవడంతో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైంది. పంచాయతీకి కేటాయించేందుకు 17 హెక్టార్ల భూమే అందుబాటులో ఉన్నదని, వారికి ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది. ఇందుకు గ్రామస్థులు ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అదానీకి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.