జనగామ, జనవరి 8 (నమస్తే తెలంగాణ): భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే అక్కడే చలాన్ ఇస్తారు. ఓ గ్రామంలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం యాదాద్రిలో స్లాట్ బుక్ చేసుకొన్న కొనుగోలుదారుడు గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయానికి చలాన్ తీసుకొచ్చాడు.
భూమి విలువ, చెల్లించిన చలాన్‌కు పొంతన లేకపోవడం, చలాన్ ఎడిటింగ్ (మార్ఫింగ్) చేసినట్టు తహసీల్దార్‌కు అనుమానం రావడంతో కలెక్టర్, డీసీపీ, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సూచనలతో జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌తోపాటు జిల్లా యంత్రాగం జనగామ తహసీల్ కార్యాలయానికి చేరుకొని రికార్డులు పరిశీలించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. తహసీల్ కార్యాలయంలో భూ భారతి సాఫ్ట్వేర్ సమస్యను పరిశీలించేందుకు వచ్చామని కలెక్టర్, ఆర్డీవో, డీసీపీ చెప్పడం గమనార్హం.
జనగామలో భూభారతి చలాన్ల స్కామ్ వెలుగులోకి రావడంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ అధికారులు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. సూత్రధారిగా అనుమానిస్తున్న యాదాద్రి భువనగిరి మీ సేవ కేంద్రం నిర్వాహకుడిని గురువారం వరంగల్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకొని సీపీ ఎదుట హాజరుపరిచి విచారిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని మీ సేవ కేంద్రం, నెట్ బ్యాంకింగ్ నిర్వాహకుడు చలాన్ల స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ కుంభకోణం ద్వారా రూ.8.55 లక్షల మేర ప్రభుత్వ ఖజానాకు గండిపడినట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం.