ములుగు, జనవరి 8 (నమస్తేతెలంగాణ) : మేడారం మహా జాతరలో భక్తులకు మౌలిక వసతులు కరువయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే మహా జాతరకు భక్తుల అవసరానికి తగిన విధంగా మరుగుదొడ్లను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. 2022, 2024 జాతరలలో 11 వేల మరుగుదొడ్లను నిర్మిస్తే ప్రస్తుతం 5,550 మాత్రమే నిర్మించారు. ముందస్తు మొకుల్లో భాగంగా ఇప్పటికే వచ్చిన లక్షలాదిగా భక్తులు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. బహిరంగ మల విసర్జనతో ఇప్పటికే పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
గద్దెల సమీపంలో రెండుచోట్ల, జంపన్నవాగు, హెలిప్యాడ్, ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద గత ప్రభుత్వ హయాంలో సులభ్ కాంప్లెక్స్‌లను నిర్మించి 74 మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఏమాత్రం చాలక భక్తులు అవస్థలు పడుతున్నారు. మేడారం మహా జాతరకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించి 11వేల మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల ద్వారా టెండర్లు నిర్వహించి ఏర్పాటు చేశారు. 2024 జాతర సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ 2023లోనే శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడారం జాతరకు కావాల్సిన నిధులను ముందస్తుగా విడుదల చేసింది. భక్తుల సంఖ్య మేరకు 11వేల మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించగా 2024లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ మహా జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినప్పటికీ కేవలం 5,500 మాత్రమే నిర్మించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. జాతర జరిగే 222 ప్రాంతాల్లో 20 మరుగుదొడ్ల చొప్పున బ్లాకులుగా మొత్తం 4440 మరుగుదొడ్లను జీఐ రేకులతో నిర్మిస్తున్నారు. జంపన్నవాగు, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో 1040 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నారు. సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద 74 మరుగుదొడ్లు ఉండగా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న మరుగుదొడ్లతో కలిపి ఈ జాతరకు 5,554 మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి.