శ్రీలీల అనగానే డాక్టర్.. యాక్టర్.. డ్యాన్సర్ అని మాత్రమే చాలామంది అనుకుంటారు. కానీ తనలో గొప్ప మానవతామూర్తి దాగున్నదని చాలామందికి తెలియదు. 24ఏండ్ల ప్రాయంలోనే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని సాటి తారలకు ఆదర్శంగా నిలిచింది శ్రీలీల. తెరపై స్టార్ హీరోయిన్గా అలరిస్తూనే, తెర వెనుక బాధ్యతగల పౌరురాలిగా ప్రత్యేకతను చాటుకుంటున్న శ్రీలీల.. ఇటీవల తన దత్తత విషయంపై మాట్లాడింది. ‘అమ్మతనంలోని మాధుర్యాన్ని అమ్మను కాకుండానే అనుభవించడం గమ్మత్తుగా ఉంది. 2019లో ‘కిస్’ అనే కన్నడ సినిమా చేశాను.
ఆ సినిమా షూటింగ్ ఒక ఆశ్రమంలో జరిగింది. ఆ టైమ్లో ఆ పిల్లలతో ఏర్పడిన అనుబంధమే దత్తతకు దారి తీసింది. ఎందుకో తెలియదు షూటింగ్ తర్వాత ఆ పిల్లల్ని విడిచి వెళ్లలేకపోయాను. వారి జ్ఞాపకాలు కొన్ని రోజులు వెంటాడాయి. 2022లో ఆ దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకున్నా. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నప్పటికీ.. మరికొంతమందికి ఇది ప్రేరణగా నిలుస్తుందనే ఉద్దేశంతో బయటకు చెప్పాను. నిజానికి ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నాకు మాటలు రావు. అప్రయత్నంగా నా గొంతు వణుకుతుంటుంది. ఇప్పటికీ ఆ పిల్లల్ని దగ్గరుండి చూసుకుంటున్నా. నేను వాళ్లకు అమ్మను మాత్రమే కాదు, ఫ్రెండ్ని కూడా ’ అంటూ భావోద్వేగానికి లోనైంది శ్రీలీల.