Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): పరిశ్రమల కోసం భూములను లీజుకి ఇచ్చే విధానం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. పరిశ్రమ ఏర్పాటు చేసుకునేవారికి భూములను విక్రయించడమే కాకుండా కావాల్సినవారికి లీజుకు కూడా ఇచ్చే విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఇది జరిగి ఆరు నెలలు దాటినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో భూముల ధరలు భారీగా పెరగడంతో పరిశ్రమ పెట్టాలనుకునేవారికి భూముల కొనుగోలు తలకు మించిన భారంగా మారింది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన ఎంఎస్ఎంఈ-2024 పాలసీలో లీజు విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశ్రమల కోసం భూములను విక్రయించడమే కాకుండా అవసరమైనవారికి 30 ఏండ్లపాటు లీజుకు ఇవ్వాలని, ఇంకా కావాలంటే లీజు గడువును పొడగించే వెసులుబాటు కూడా కల్పిస్తామని ఆ పాలసీలో పేర్కొన్నారు. అంతేకాదు, చిన్నతరహా పరిశ్రమల కోసం షెడ్లు నిర్మించి లీజుకి ఇస్తామని, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను అభివృద్ధిచేసి వాటిలో 20 శాతం ఎంఎస్ఎంఈలకు కేటాయిస్తామని ప్రకటించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమల కోసం చౌక ధరలకే భూములను కేటాయించడంతోపాటు 90 రోజుల్లోగా డబ్బు చెల్లించే వెసులుబాటుని కల్పిస్తూ టీఎస్ ఐపాస్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీంతో చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సులభంగా బ్యాంకుల నుంచి రుణాలు పొంది వ్యాపారాలు ప్రారంభించేవారు. కాగా, కొంతకాలంగా రాష్ట్ర సర్కారు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ పేరుతో గందరగోళ వాతావరణాన్ని సృష్టించడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భూములు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వద్ద లీజుకు తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తుందో, లీజు విధానం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో అర్థంకావడం లేదు.