రాజాపేట, ఏప్రిల్ 09 : పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సిబ్బందికి సూచించారు. బుధవారం రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల తాసీల్దార్ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణిలో తప్పుడు రిపోర్ట్ పంపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల సర్వేయర్ వద్ద సర్వే కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంట వెంటనే పరిష్కరించి ప్రజలకు అందించాలన్నారు.
రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీడీఓకి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం ఈ నెల 14న దరఖాస్తుకు గడువు ముగియనున్నందున ప్రజలకు అవగాహన కల్పించి లబ్ధింపొందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ అనిత, ఎంపీడీఓ నాగవేణి, డిప్యూటీ తాసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్ఐలు నర్సింలు, రమేశ్ పాల్గొన్నారు.