ఖైరతాబాద్, డిసెంబర్ 25 : ‘ మా స్థలాన్ని బీజేపీ నేత వెంకటరమణ అక్రమంగా కబ్జాకు యత్నిస్తున్నాడు….అతడి అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు….మాకు రక్షణ కల్పించాలి’ అని స్థల యజమాని కుమార్తె సుజాత కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తల్లి విజయలక్ష్మితో కలిసి వివరాలను వెల్లడించారు. 2007లో తన తండ్రి దివంగత కృష్ణ లాల్ దర్వాజా, పూల్‌బాగ్‌లోని అలియాబాద్‌లో 932 గజాల స్థలాన్ని (డాక్యుమెంట్ నం.3885/2007) కొనుగోలు చేశారని తెలిపారు.
ఇంటి నం.18-5-116 నుంచి 120, 18-5-426తో రిజిస్టర్ అయి ఉందన్నారు. 2008లోనే బీజేపీ నాయకుడిగా చెప్పుకుంటున్న పొన్న వెంకటరమణ కన్ను తమ స్థలంపై పడిందని, అప్పటి నుంచి దానిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడన్నారు. 2008 ఈ భూమి తనదేనంటూ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడని, అన్ని సాక్ష్యాధారాలు, రుజువులను పరిశీలించి కోర్టు 2018లో దీనిపై పూర్తి హక్కు తన తండ్రి కృష్ణకే ఉందని తీర్పునిచ్చారన్నారు. అయితే కోట్ల రూపాయలు విలువైన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు వెంకటరమణ అతడి అనుచరులతో కలిసి తన తల్లి, తమపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ఇదే ప్లాటుపై నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్, ఓటరు కార్డు తీసుకున్నాడన్నారు. ప్రస్తుతం హైకోర్టులో అప్పీలు చేసుకున్న పొన్న వెంకటరమణ కేసు పెండింగ్‌లో ఉండగానే, కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని, అతడి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని సుజాత కోరారు.