హైదరాబాద్ : రాజేంద్రనగర్లో భూ వివాదం పోలీసులకు ఫిర్యాదుచేసే వరకు వెళ్లింది. సన్ సిటీ దగ్గర ఓ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహరి గోడను దుండగులు జేసిబీతో కూల్చివేశారు. దౌర్జన్యంగా ప్రైవేట్ స్థలంలోకి ప్రవేశించిన 100 మంది హంగామా చేశారు. స్థల యజమాని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
దాంతో భూ యజమాని రవి యాదవ్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా 1935వ సంవత్సంరలో రవి యాదవ్ కుటుంబీకులు హైదర్షాకోట్ సర్వే నెంబర్ 16, 17, 18, 19 లో ఉన్న 39.24 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 39 ఎకరాల వ్యవసాయ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఆ 39 ఎకరాల్లో 21 ఎకరాల పొలాన్ని 1971వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. అయితే సర్వే నెంబర్ 18/4 లో ఉన్న 33 గుంటల స్థలం వివాదంలో ఉంది. కొంతమంది ఆ స్థలం తమదంటూ దౌర్జన్యం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి జేసీబీలతో రెచ్చిపోయారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారులు ఆ ఖరీదైన భూమిపై కన్నేశారు.
భూమి తమదని గొడవకు రావడంతో.. యజమాని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని భూ యజమాని పోలీసులను కోరారు.