జమ్మూ: విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk) ప్రస్తుతం లడాఖ్‌లో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన 36 రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. బుధవారం లడాఖ్‌లో యువత ఆందోళన చేపట్టి.. భారీ విధ్వంసాన్ని క్రియేట్ చేశారు. లడాఖ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌ను అమలు చేయాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీబీఐ.. విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్కు చెందిన విద్యాసంస్థపై దర్యాప్తు చేపట్టింది.
విదేశీ పెట్టుబడుల చట్టం కింద ఉల్లంఘన జరిగినట్లు సీబీఐ భావిస్తున్నది. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఆల్టర్నేటివ్స్ లడాక్(హెచ్ఐఏఎల్)పై రెండు నెలల క్రితమే సీబీఐ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6వ తేదీన పాకిస్థాన్‌లో వాంగ్‌చుక్ పర్యటించాడు. దీన్ని కూడా దర్యాప్తు సంస్థ రివ్యూ చేస్తున్నది. ఆగస్టులో లడాఖ్ అడ్మినిస్ట్రేషన్.. హెచ్ఐఏఎల్కు భూ కేటాయింపును రద్దు చేసింది. దీంతో అక్కడ వివాదం ప్రారంభమైంది.
రాష్ట్రహోదా, రాజ్యాంగ విధుల కోసం పోరాటం చేస్తున్న లడాఖీ గ్రూపులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. హక్కుల కోసం పోరాడుతున్న కేంద్ర పాలిత ప్రజలపై దాడిగా ఆ గ్రూపులు ఆరోపించాయి. విద్యాసంస్థకు వస్తున్న నిధుల గురించి ఆరాతీయడం వల్లే వాంగ్‌చుక్ జనాలను రెచ్చగొట్టినట్లు భావిస్తున్నారు. బుధవారం చోటుచేసుకున్న హింసలో నలుగురు మృతిచెందారు. 80 మంది గాయపడ్డారు. దీంట్లో 40 మంది పోలీసులు కూడా ఉన్నారు.
తనను బంధిస్తే ప్రభుత్వానికి సమస్యలు వస్తాయని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. తాజా అల్లర్లకు తనను హోంశాఖ బద్నాం చేసిందని, ఇది బలిపశువును చేసే ప్రయత్నమని ఆరోపించారు. జనాలను రెచ్చగొట్టినట్లు కేంద్ర హోంశాఖ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. పబ్లిక్ సేఫ్టీ యాక్టు(పీఎస్ఏ) కింద అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు వాంగ్‌చుక్ పేర్కొన్నాడు.