Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కోకు రెగ్యులర్ సీఎండీలు లేకపోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయా శాఖల్లోనే చర్చ జరుగుతున్నది. ‘పెద్దసార్లు’ ఆఫీసులకు రావడంలేదని తెలుస్తున్నది. ఎప్పుడో ఓసారి చుట్టం చూపుగా వచ్చినా ఫైళ్లు ముట్టుకోవడంలేదని సమాచారం. ముఖ్యమైన నిర్ణయాలు కార్యరూపు దాల్చడంలేదని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డిస్కంలలో పైసల్లేనిదే పనులు కావడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడులు చేసినా తీరు మారడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. కానీ ట్రాన్స్‌కో, జెన్కోలో బదిలీలు చేయలేదు. ట్రాన్స్ఫర్ పాలసీని కూడా రూపొందించలేదు. కానీ దక్షిణ డిస్కం, ఉత్తర డిస్కం పరిధిలో మాత్రమే బదిలీలు చేశారు. ఈ బదిలీల్లోనూ లంచాలు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో నాలుగు నెలలుగా అనుభవం గల ఇంజినీర్లు, సిబ్బంది లేకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతున్నది. వైటీపీఎస్ యూనిట్-2 బాయిలర్‌లో ఇటీవల క్లింకర్(సున్నం బూడిద) పేరుకుపోయి ఉత్పత్తి ఆగింది. మరమ్మతులు చేస్తుండగా వేడి బూడిద మీద పడి కార్మికులు గాయపడ్డారు. కొందరు ఏకంగా రెండు జీతాలు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
టీజీ జెన్కోలోని కొందరు అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2024 అక్టోబర్ 9న 203 మంది అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ)లకు అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్(ఏడీఈ)లుగా పదోన్నతి కల్పించారు. ప్రమోషన్స్‌లో అక్రమాలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు జనవరి 31న తుది తీర్పునిచ్చింది. పోస్టింగ్స్ ఇచ్చేందుకు లైన్‌క్లియర్ అయింది. తీర్పు వచ్చి నెలలు గడిచినా ఉన్నతాధికారులు పోస్టింగ్స్ మాత్రం ఇవ్వలేదు. దీంతో పాలన అస్తవ్యస్తమై, పనులు గాడి తప్పుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.