కుమ్రం భీం ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ/ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, ఏప్రిల్ 21: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న పోషణ అభియాన్ పథకం దేశంలోనే జిల్లాకు అరుదైన గుర్తింపుని తీసుకొచ్చింది. పోషణ్ అభియాన్ పరిపాలన అమలులో 2021 సంవత్సరానికి జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు సివిల్ సర్వీస్ డేను పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రధాన మంత్రి చేతుల మీదుగా పీఎం ఎక్స్లెన్సీ అవార్డును అందుకొన్నారు. ఈ అవార్డు కుమ్రంభీం ఆసిఫాబాద్వంటి మారుమూల జిల్లాకు రావటం గర్వంగా ఉన్నదని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఐసీడీఎస్, డీఆర్డీఏ, ఆరోగ్యశాఖల ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, ఆరేండ్లలోపు పిల్లలకు మంచి సేవలు అందుతున్నాయని కలెక్టర్ చెప్పారు. దేశంలోనే ప్రథమస్థానంలో జిల్లా నిలిచేలా కృషిచేసిన సిబ్బందిని అభినందించారు.